సిక్కోలులో జగన్ చెంతకు కొండ్రు మురళి?

ఏపీకి శివారున్న శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి. కాంగ్రెస్ నేత కొండ్రు మురళీ మోహన్ వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండతోనే ఆయన ఈస్థాయికి వచ్చారనేది వాస్తవం. తాజాగా మురళి తన సహచరులు, అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చించారని సమాచారం. ప్రజా సేవ చేసిన అనుభవం, ఇంకా చేయాలనే తాపత్రయం ఉండడంతో ఇంకా ఇలాగే ఉంటే లాభం లేదని కొండ్రుమురళి భావిస్తున్నారట. అందుకే ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన జగన్ పార్టీలో చేరనున్నారనే వార్త వెలువడటంతో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సీపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో జగన్ కు ఓ పాతికమంది నేతలు దూరమయ్యారు. అయినా తనతండ్రి అండగా ఉండి, ఆయన హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ నే అంటిపెట్టుకున్న చాలామంది సీనియర్లు, జూనియర్లంతా ఇప్పుడు జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
దీంతో గతంలో రెండుసార్లు టీడీపీ నేత ప్రతిభాభారతిని ఓడించి, బలమైన నేతగా దూసుకుపోయిన కొండ్రు మురళి త్వరలో జగన్ చెంతకు చేరనున్నారనేది స్పష్టమవుతోంది. ఆయన ఇంతకాలం కాంగ్రెస్ లోనే ఉన్నా ఆపార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటూ వచ్చారు. 2019లో పోటీ నేపథ్యంలో ముందుగా టీడీపీలో చేరతారని వార్తలు వచ్చినా, అక్కడినుంచి పిలుపు వచ్చినా ఆయన మనసు వైసీపీ వైపే ఉందని తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంతోపాటు సీటు కూడా ఖరారు చేయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మురళి వచ్చే నెలలో వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సిక్కోలులో బలంగా ఉన్న టీడీపీని ఢీకొట్టాలంటే మురళి లాంటి బలమైన నేతలు అవసరమని వైసీపీ అధినేత కూడా భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ పాదయాత్రలో శ్రీకాకుళం వచ్చినప్పుడు కొండ్రు మురళి పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఉత్తరాంధ్రలో మరో బలమైన నేత జగన్ పార్టీలో చేరబోతున్నారని స్సష్టమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.