సురేఖ అక్కా  ఇంత‌కీ ఏ పార్టీలోకి చేరుతున్నావ్‌?

కొండాసురేఖ‌. పాపం మొన్నేమో.. వైసీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్ ఇలా రెండుపార్టీలు చుక్క‌లు చూపాయి. పొమ్మ‌న‌లేక పొగ‌పెట్టాయి. ఇప్పుడు మిగిలింది మ‌రో పార్టీ. దాదాపు కొండా దంప‌తులు పార్టీ వీడిన‌ట్లే. గులాబీకండువా తీసి బ‌య‌టప‌డేయ‌ట‌మే మిగిలింది. అయితే.. త‌మ అక్క‌సంతా కేసీఆర్ మీద కాద‌ని.. ఓన్లీ కేటీఆర్ మీద‌నే అంటూ సురేఖ మ‌రోసారి తేల్చిచెప్పింది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సాక్షిగా కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాసింది. సీఎం కావాల‌నే నీ క‌ల నెర‌వేర‌దు. నా మాటే శాస‌న‌మంటూ.. ఆదేశించింద‌న్న‌మాటే. మ‌రో అడుగు ముందుకేసి రాజ‌కీయ స‌న్యాసానికి రెడీగా ఉండ‌మంటూ కేటీఆర్‌కు జోస్యం కూడా చెప్పిందండోయ్. వాస్త‌వానికి సురేఖ దంప‌తుల‌కు వ‌రంగ‌ల్ కంచుకోట వారికంటూ ప్ర‌త్యేక వ‌ర్గం ఉంది. త‌మ ఆర్ధిక‌, అంగ‌బ‌లాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టివ‌ర‌కూ తామున్న పార్టీల‌ను శాసిస్తూ వ‌చ్చారు. పైగా తెలంగాణ‌లో మున్నూరు కాపుల ఓటింగ్ కూడా చాలా కీల‌కం. సురేఖ దంప‌తులు మున్నూరు కాపు వ‌ర్గానికి చెందిన వారు కావ‌టంతో దాదాపు పార్టీల‌న్నీ వారిని చేర‌దీశాయి. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ కూడా అటు డి.శ్రీనివాస్‌, కేకే, దానం నాగేంద‌ర్‌, కొండా దంప‌తుల‌ను పార్టీలోకి తీసుకోవ‌టం వెనుక ప్ర‌ధాన కార‌ణం వారి కుల‌మే.
అయితే.. రాజ‌కీయంగా త‌మ చెప్పుచేత‌ల్లో ఉండ‌కుండా జారిపోయే ప్ర‌మాదం ఉంద‌నే ఉద్దేశంతోనే ఇటీవల డీఎస్ కుటుంబాన‌కి ఎస‌రు పెట్టారు. ఇప్పుడు సీటివ్వ‌కుండా కొండా సురేఖ‌కు ప‌క్క‌కు త‌ప్పించారు. తామేమీ మాట్లాడ‌కుండానే సురేఖ‌ను రెచ్చ‌గొట్టి ఆమె స్వ‌యంగా కేసీఆర్ ను విమ‌ర్శించేలా చేయ‌టంలో అధికార పార్టీ వ్యూహం పారింది. ఇప్పుడు మిగిలింది.. వారిద్ద‌రూ ఏ పార్టీలో చేర‌తార‌నేది. వాస్త‌వానికి కొండా దంప‌తులు హ‌స్తం వైపు మొగ్గుచూపారు. కానీ.. వారికి సీటిస్తే త‌మ‌కు సీటు మిగ‌ల‌ద‌నే ఉద్దేశంలో కొంద‌రు సీనియ‌ర్లు వారించారట‌. ఇదే స‌మ‌యంలో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో కొండాదంప‌తులు ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ నుంచి వీరికి పిలుపు అందిన‌ట్లు స‌మాచారం. అందుకే. ప్రెస్‌మీట్లో మ‌హాకూట‌మికి అనుకూలంగా.. సోనియాప‌ట్ల తాము ప్రేమ‌తోనే ఉన్న‌ట్లు మాట్లాడారు. మ‌రి ఈ లెక్క‌న‌.. అక్క హ‌స్తం గూటిలోకి చేరుతుంద‌నే ఊహాగానాల‌కు బ‌లం వ‌చ్చిన‌ట్ట‌యింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.