
కొండా సురేఖ.. తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌గా పేరు. వైసీపీలో ఇమడలేక గులాబీ గూటిలోకి చేరారు. ఎమ్మెల్యేగా తాను.. ఎమ్మెల్సీ గా భర్త వున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన ఉంది. అన్నీ తామై చక్రం తిప్పిన దంపతులు చేతులు కట్టేసినట్లుగా మారారనే వారి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుందట. వాస్తవానికి కొండా సురేఖ పరకాల చుట్టుపక్కల బాగానే పట్టుంది. మున్నూరు కాపు వర్గానికి చెందిన వీరికి సామాజికవర్గంలోనూ మంచి గుర్తింపే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే.. కేసీఆర్ తమ వైపుకు లాగినట్లు సమాచారం. అయితే గతంలో కేసీఆర్‌ను తిట్టిపోసిన కొండా సురేఖపై కేసీఆర్ వర్గం గుర్రుగానే ఉందని తెలుస్తోంది. కేబినెట్లో ఆమెకో.. భర్తకో చోటు కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఇంతలో టీడీపీ నుంచి ఎర్రబెల్లి గులాబీ గూటిలోకి చేరటంతో సమీకరణలు మారాయి. ఎవర్ని పదవి పలుకరిస్తే.. మరో వర్గం దూరమవుతుందనే ఉద్దేశంతో మంత్రి పదవులు ఇద్దరికీ దక్కకుండా పోయాయి . దీనిపై ఇరువర్గాలు ఉప్పునిప్పుల్లా ఉంటున్నాయట. సురేఖ దంపతులను కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి మరోచోటికి మారమంటూ టీఆర్ఎస్ అదిష్ఠానం నుంచి వత్తిడి పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అటు మంత్రి పదవి దక్కక.. ఇటు ఇన్నేళ్లుగా వున్న నియోజకవర్గానికి దూరమవటాన్ని అవమానంగా భావిస్తున్న సురేఖ వర్గం.. పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె మాత్రం.. రూమర్స్‌ను కొట్టిపారేస్తున్నారు. ఇరవైఏళ్లుగా గెలుస్తూ వస్తున్న తనను మరో నియోజకవర్గం మారమంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. తనను నమ్ముకుని వున్న వారి కోసం అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమనే సంకేతాలు పంపారు.
Be the first to comment