అందరి చూపు కొణ‌తాల వైపు… మ‌రి ఆయ‌న చూపు ?

విశాఖప‌ట్నం జిల్లాలో బ‌డా నేత‌గా పేరొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేర‌నున్నార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈయన రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందిన నేత. అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాన్ని శాసించగల సత్తా క‌లిగిన నేత‌గా పేరొందారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అనే విషయమై ఉత్త‌రాంధ్ర‌లో చ‌ర్చ‌ జ‌రుగుతోంది. కొణ‌తాల రామకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1989లో అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పలనరసింహంపై గెలుపొందారు. తిరిగి 1991లో కూడా లోక్‌సభకు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి అప్పలనరసింహంపై గెలుపొందారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా ఎంపికయ్యారు. 1996తో అత‌ని ఎంపీ పదవీ కాలం పూర్తయ్యింది. తరువాత మళ్లీ 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావుపై గెలుపొందారు. ఆ సమయంలో ఒకేసారి మూడు కేబినెట్‌ మంత్రి పదవులు నిర్వహించిన ఘ‌న‌త సాధించారు. తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాల‌య్యారు. వైఎస్‌ మరణానంతరం ఆయన జగన్‌ వెంట ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన తమ్ముడు రఘునాథ్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చ‌విచూశారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలలో వైసీపీ నుంచి బహిష్కృతులైన కొణతాల రామకృష్ణ ఏ పార్టీలోనూ చేరకుండా ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు. గ‌తంలో ఆయన తెలుగుదేశంలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం కొణ‌తాల‌ను తిరిగి వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే జగన్‌ నుంచి స్వయంగా పిలుపు వస్తే ఆ పార్టీలో చేరాలని కొణ‌తాల నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆయ‌న‌ సన్నిహితులు చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ లో చేర‌నున్న మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి… మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, తదితర మాజీ నాయకులకు స్వయంగా ఫోన్‌ చేసి తాను తిరిగి పార్టీలో చేరుతున్నట్టు చెప్పార‌ని తెలుస్తోంది. అలాగే వారిని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. దీనికి వారు అలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పిన‌ట్టు బోగ‌ట్టా! చూద్దాం ఏమౌతుందో మ‌రి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.