‘కె.జి.ఎఫ్‌’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: కైకాల స‌త్య‌నారాయ‌ణ‌
విడుద‌ల‌: వారాహి చ‌ల‌న చిత్రం
నిర్మాణ సంస్థ: హోంబ‌లే ఫిలింస్‌
న‌టీన‌టులు: య‌ష్‌, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్‌, మాళ‌వికా అవినాష్‌, అనంత్ నాగ్‌, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, వ‌శిష్ట త‌దిత‌రులు
సంగీతం: ర‌వి బ‌స్రూర్‌, త‌నిష్క్ బాగిచ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: భువ‌న్ గౌడ‌
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ నీల్‌
నిర్మాత‌: విజ‌య్ కిర్గందూర్

పరిమిత బడ్జెట్ లో రూపొందే కన్నడ సినిమాలకు జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ ఎన్నడూ మార్కెట్ లేదు. అందువల్లే వాటి డబ్బింగులు కూడా చాలా అరుదుగా జరిగేవి. కానీ కెజిఎఫ్ ఈ ట్రెండ్ కి భిన్నంగా ఏకంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధపడి అందులో ఉన్న రా కంటెంట్ తో దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. దీంతో నిన్నటి దాకా ఎవరికి పెద్దగా పరిచయం లేని హీరో యష్.. కెజిఎఫ్ ద్వారానే అందరి దృష్టిలో పడ్డాడు. శాండల్ వుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా ప్రత్యేకతను సంతరించుకున్న కెజిఎఫ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పోటీ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద తలపడిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది చూద్దామా..

క‌థ‌:
సూర్య‌వ‌ర్ధ‌న్‌ అనే వ్యక్తికి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న అత‌ను ప్ర‌భుత్వంతో 99 ఏళ్ల‌కు లీజుకు తీసుకుని బంగారం త‌వ్వే ప‌ని ప్రారంభిస్తాడు. అంతేకాదు ఆ ప్రాంతానికి ప‌టిష్ట‌మైన కాప‌లాను కూడా పెట్టుకుంటాడు. చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌ను తీసుకొచ్చి వారిని బానిస‌లుగా మార్చి ప‌నులు చేయిస్తుంటాడు. అయితే అనుకోకుండా సూర్య‌వ‌ర్ధ‌న్‌కి ప‌క్ష‌వాతం వచ్చేస్తుంది. దాంతో అంద‌రూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిప‌త్యం సాధించాలని ప్రయతించటం మొదలు పెడతారు. కానీ సూర్య‌వ‌ర్ధ‌న్ కొడుకు గ‌రుడ అంద‌రినీ త‌న కంట్రోల్‌లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. సూర్య‌వ‌ర్ధ‌న్‌కు న‌మ్మ‌కంగా ఉన్న అయిదుగురు గ‌రుడ‌ను చంపి ఆ బంగారు గ‌నుల‌కు నాయ‌కులుగా ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకుంటారు. ఈ క‌థ ఇలా సాగుతుండ‌గా చిన్న వ‌య‌సులోనే తండ్రి లేకపోవ‌డంతో త‌ల్లి పెంప‌కంలోనే పెద్ద‌వుతాడు రామ‌కృష్ణ ప‌వ‌న్‌(య‌ష్‌). ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సుకే త‌ల్లి క్యాన్స‌ర్ వ్యాధితో చ‌నిపోతుంది. బాగా బ్ర‌త‌కాలంటే డ‌బ్బు అవ‌స‌రం అని తెలుసుకున్న రామ‌కృష్ణ ముంభై చేరుకుని అక్క‌డ షూ పాలిష్ చేస్తూ జీవితం వెళ్లదీస్తుంటాడు. ముంబైలో అలీ, శెట్టికి మ‌ధ్య అధిపత్య పోరు సాగుతుంటుంది. శెట్టి ప‌క్షాన నిల‌బ‌డ్డ రామ‌కృష్ణ .. రాకీగా ఎదుగుతాడు. ఎదిగే క్ర‌మంలో అనేక స‌వాళ్ల‌ను దాటుకుంటూ వ‌స్తాడు. రాకీ స్టామినా తెలుసుకున్న రాజ్య‌వ‌ర్ధ‌న్ త‌న‌ను బెంగ‌ళూరుకి పిలిపిస్తాడు. గ‌రుడ‌ను చంపే ప‌నిని అప్ప‌గిస్తాడు. బెంగ‌ళూరులో చంప‌డానికి ప్ర‌య‌త్నించిన య‌ష్ .. అవ‌కాశాన్ని కోల్పోతాడు. అందుకే త‌న‌ను చంప‌డానికి కె.జి.ఎఫ్ వెళ‌తానంటాడు. రాజ్య‌వ‌ర్ధ‌న్ అత‌ని మ‌నుషులు కూడా స‌రేనంటారు. కె.జి.ఎఫ్ ప‌టిష్ట‌భ‌ద్ర‌త‌ను త‌ట్టుకుని రాకీ ఎలా ప్ర‌వేశించాడు? అక్క‌డ గ‌రుడను చంప‌డానికి ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? ఈ సంగతులన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే:

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ 1981 బ్యాక్‌డ్రాప్‌లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్.. ఓ సాధార‌ణ యువ‌కుడు ఆ ఫీల్డ్స్‌కు ఎలా అధినేత అయ్యాడనే క్ర‌మంపై పుస్త‌కం రాసిన‌ట్లు.. దాన్ని గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తే.. దానిపై శోధ‌న చేసే ఓ ప్ర‌తికాధినేత‌కు ఆ పుస్తకాన్ని రాసిన జ‌ర్న‌లిస్ట్ క‌థ‌ను వివ‌రించ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. క‌థంతా య‌ష్ ప్ర‌ధానంగానే అత‌ని చుట్టూనే తిరిగేలా క‌థ‌ను రాసుకున్నాడు. అత‌కి క‌న్న‌డలో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలోపెట్టుకుని రాసుకున్న క‌థ అని తొలి స‌న్నివేశం నుండి అర్థ‌మ‌వుతుంది. హీరో ఓ డాన్‌గా ఎదిగే క్ర‌మాన్ని క్ర‌మంగా చూపించాడు. త‌ల్లి చ‌నిపోవ‌డంతో హీరో అనాథ‌గా మార‌డం.. అక్క‌డ నుండి చిన్న డాన్‌గా ఎదిగి ముంబై గోల్డ్ బిజినెస్‌ను శాసించే వ్య‌క్తి.. ఓ డీలింగ్‌లో కె.జి.ఎఫ్ అధినేత‌ను చంప‌డానికి ఆ గ‌నుల‌కు వెళ్లి అక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల మానసిక ప‌రిస్థితిని గ‌మ‌నించి ఎదురుతిరిగి వారికి దేవుడిగా మార‌డం ఒక‌టైతే.. అక్క‌డి ప్ర‌జ‌ల‌నే త‌న సైన్యంగా మార్చుకుని ఏం చేశాడ‌నేదే చాప్ట‌ర్ 2లో చూపించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓ క‌న్‌క్లూజ‌న్ ఇచ్చాడు. దీనికి ఓ దేశ ప్ర‌ధానికి ఉన్న లింకేటంనేది కూడా తెలుసుకోవాలంటే రెండో అధ్యాయంలో చూడాల్సిందే. య‌ష్ సినిమా అంతా తానై ముందుకు న‌డిపించాడు. అయితే హీరో మ‌రి సూప‌ర్‌మేన్‌లాగా పైట్స్ చేయ‌డం అతిశ‌యోక్తిగా అనిపిస్తుంది. వాస్త‌వానికి మ‌రీ దూరంగా హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ఫ‌స్టాఫ్‌లో హీరో మెయిన్ విల‌న్‌ను చంపాల‌నుకోవ‌డం.. రెండో పార్ట్‌లో అత‌న్ని చంప‌డానికి కె.జి.ఎఫ్ వెళ్లి ఏం చేశాడ‌నే క‌థాంశంతో సినిమా ర‌న్ అవుతుంది. మొత్తంగా చూస్తే ఇది ప‌క్కా ఇదొక మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

నటీనటుల పనితీరు:
హీరో యష్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్ర‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేదు. సినిమాలో అంద‌రూ క‌న్న‌డ ఆర్టిస్టులే న‌టించారు. అయ్య‌ప్ప పి.శ‌ర్మ మిన‌హా తెలిసిన ముఖాలేవీ లేవు. త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో త‌ళుక్కున్న మెరిసింది.

టెక్నీషియన్ల పనితీరు:
క‌థ‌నం కూడా స్టోరీ నెరేష‌న్‌తోనే సాగేలా ద‌ర్శ‌కుడు డిజైన్ చేసుకున్నాడు. పాట‌లు ఓకే. నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు కొత్త లుక్‌ను తీసుకొచ్చింది.

బలాలు
* యష్ యాక్షన్
* సినిమాటోగ్రఫీ
* కొన్ని యాక్షన్ సీన్స్‌

బలహీనతలు:
* ఎక్క‌డా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కనిపించకపోవటం
* సెకండాఫ్‌ క‌థేమిటో ప్రేక్ష‌కుడు ముందుగానే ఊహించటం

మొత్తంగా: కేజిఎఫ్ చాప్టర్ వన్ – భారీ సినిమా, యష్ యాక్షన్ హైలైట్స్

రేటింగ్: 3/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.