కాంగ్రెస్‌తో జతకట్టిన మరో బలమైన పార్టీ

మహారాష్ట్రలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే వార్తలు వినిపించాయి. అయితే దేశమంతటా నరేంద్ర మోదీపై వ్యతిరేకత పెరుగుతుందంటున్న నేపధ్యంలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఏకతాటిపైకి వచ్చినట్టు సమాచారం. 2019 సాధారణ ఎన్నికలకు ఇంకా స్వల్ప వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ పార్టీల మధ్య పొత్తులు కుదురుతున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌ 24, ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీకి సిద్ధ పడగా, మరో స్థానం స్వాభిమాని షెట్కారీ సంఘటన్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలకు చెందిన కీలక నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వాభిమాని షెట్కారీ సంఘటన్‌ అధినేత రాజు షెట్టీ ఒక స్థానం నుంచి గెలుపొందారు. అయితే అప్పుట్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కొనసాగారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో కూటమి నుంచి విడివడి.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో జతకట్టారు. దీంతో ఆయపోటీ చేసిన సీటు అతనికే కేటాయించేందుకు రెండు పార్టీలు అంగీకరించాయని భోగట్టా. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఒక కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ మాత్రం మరో నాలుగు స్థానాలు తమకే ఇవ్వాలని కోరుతోందని సమాచారం. వీటిలో ప్రధానంగా పూనె, యవతమాల్‌ స్థానాలు తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోందని సమాచారం.

కాగా అహ్మద్‌నగర్‌, పూనె సీట్ల విషయంలో కాంగ్రెస్‌ ఎంతమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీనికితోడు పూనె జిల్లాలోని మూడు సీట్లలో ఎన్సీపీ పోటీ చేయనుందని, ఉన్న ఒక్క సీటు కూడా ఆ పార్టీకే కేటాయిస్తే కాంగ్రెస్‌ పూనెలో కనుమరుగవుతుందనే వాదనను కాంగ్రెస్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కోరుతున్న విధంగా అహ్మద్‌నగర్‌ సీటును త్యాగం చేసేందుకు ఎన్సీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా గతంలో ఇక్కడి నుంచి ఎన్సీపీ పోటీ చేసి మూడుసార్లు వరుసగా పరాజయం పాలైంది. పూనె సీటును కాంగ్రెస్‌ ఇస్తేనే ఎన్సీపీ అహ్మద్‌నగర్ సీటును త్యాగం చేస్తామనే షరతు విధించినట్లు సమాచారం. దీనికితోడు ఎస్సీపీ యవతమాల్‌ సీటును తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం కూడా చెబుతూ, అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే తమ అభ్యర్థే బలంగా ఉన్నారంటోందని భోగట్టా. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదని సమాచారం. కాగా పాలఘర్‌ సీటును బహుజన్‌ వికాస్‌ అగాధి పార్టీకి కేటాయించేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీలు మరో కండీషన్ కూడా పెట్టాయని బోగట్టా. ఆ పార్టీ ఈ కూటమితో జతకడితేనే ఈ కేటాయింపు సాధ్యమని చెబుతున్నాయని అంటున్నారు. కాగా బహుజన్‌ వికాస్‌ అగాధి పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమితో భాగస్వామ్యం వహించింది. అయితే ఆ తర్వాత బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో మున్ముందు ఏం జరగనుందో వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.