వైకాపా బాటలో కీలక నేతలు

సాధారణంగా అధికార పక్షంలోకి ఎక్కువగా నేతలు వలస వెళతారు. ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. మొన్నటి వరకు అధికార పార్టీలోకి వెళ్లారు చాలా మంది లీడర్లు. ఇప్పుడు విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారు. సీనియర్ నేత మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. యలమంచిలి రవి టీడీపీని వీడి వైకాపాలోకి వెళ్లారు. ఇప్పుడు ఆనం రామ నారాయణ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి అదే బాటలో ఉన్నారంటున్నారు. ఇక మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పెదకూరపాడులో నాలుగు సార్లు, గుంటూరులో ఒకసారి గెలిచిన కన్నాకు మంచి పట్టు ఉంది. బీజేపీలో ఉంటే తాను గెలిచే పరిస్థితి ఉండదని తటపటాయిస్తున్నారు. అందుకే సహచరులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే సమాచారం కన్నాకు చేరింది. అందుకే వీలున్నంత తొందరగా పార్టీ మారేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారని చెబుతున్నారు అనుచరులు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజి ఇచ్చే విషయంలో చేతులెత్తేసింది బీజేపీ. మరోవైపు చంద్రబాబు పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగా లేరట. ఆయనే కాదు.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా వైసిపి బాట పట్టారు. ఈ నెల ఇరవైతొమ్మిదిన ఆయన జగన్ పార్టీ జెండా పట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే అన్ని మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వీరిద్దరే కాదు… పనబాక లక్ష్మీ, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిలు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఇక మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతున్నారు. ఫలితంగా వలసలు మొదలయ్యాయనే చెప్పాలి. 
విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సమక్షంలో వారంతా ఆ పార్టీలో చేరనున్నారు. కన్నా ఆరుసార్లు, కాటసాని ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కన్నా దాదాపు పద్నాలుగేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందులోను కాపు సామాజిక వర్గం నేతగా గుర్తింపు ఉంది. ఫలితంగా వైకాపా కూడ ఆయన సేవలను వినియోగించుకునేందుకు సిద్దమైంది. బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయనతో సుదీర్ఘంగా చేసిన మంతనాలు ఫలించాయంటున్నారు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.