మాట మార్చిన డిప్యూటీ సీఎం.. కారణమిదేనా..?

తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్ మధ్య స్నేహ బంధం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ప్రతి పార్టీ తమకు తోచిన విధంగా స్పందిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిని విమర్శనాస్త్రంగా మార్చుకుంటే.. అధికార పక్షం మాత్రం సమర్ధించుకుంటోంది. అందరి సంగతి ఏమోగానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి కారణం గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తును వ్యతిరేకించడమే. కొద్దిరోజుల కిందట టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిమెలసి ఉండడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆయనతో పాటు పలువురు సీనియర్లు కాంగ్రెస్‌తో పొత్తు వద్దని బాహాటంగా చెప్పారు. అందరి సంగతి ఏమోగానీ, కేఈ తన వాదనను వినిపించడం వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన నేత కావడమే దీనికి ప్రధాన కారణమని ప్రచారం జరిగింది.

ఇప్పుడు చంద్రబాబు.. రాహుల్‌తో భేటీ తర్వాత కేఈ స్పందించారు. అంతేకాదు, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం చంద్రబాబు భేటీపై ఆరోపణలు చేస్తున్న నేతలు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. రాహుల్‌గాంధీని చంద్రబాబు కలిస్తే… ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు తర్వాత బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? లక్ష్మీపార్వతి జగన్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మనకు తీరని అన్యాయం చేసినవారిపై తిరగబడి హ్కకులను కాపాడుకోవాలనుకోవడం తప్పా? అని లేఖలో కేఈ ప్రశ్నించారు. గతంలో పొత్తు వద్దన్న ఆయనే ఇప్పుడు సమర్ధించడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయనలో మార్పుకు కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీసిన వారికి క్లారిటీ వచ్చిందట. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారమే కేఈ మారారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.