సిట్టింగ్‌లను అప్రమత్తం చేస్తున్న కేసీఆర్

ముందస్తు ఉన్నా లేపోయినా వచ్చే ఎన్నికల వ్యూహంపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఇప్పటికే మూడు దఫాలుగా సర్వేలు నిర్వహించి, సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నారని సమాచారం. ఈ విధంగా వారిని వచ్చే ఎన్నికలకు  సమాయత్తం చేస్తున్నారని తెలుస్తోంది. విజయవకాశాలు మెండుగా ఉన్న సిట్టింగ్‌లను అదే ఒరవడిని కొనసాగించాల్సిందిగా సూచించినట్లు తెలిసింది, అలాగే పనితీరు సంతృప్తిగా లేనట్టు సర్వేలో తేలిన సిట్టింగ్‌లను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన సిట్టింగ్‌లున్న చోట్ల వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయం సాధించగలమనే కోణంలో కూడా టీఆర్‌ఎస్  కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలుగా కొనసాగుతోన్న వారికి టికెట్ ఇస్తే బరిలో నెగ్గుకురాగలుగుతారా? అనే దానిపై పార్టీ అధిష్ఠానం యోచన చేస్తోంది. లేనిపక్షంలో ప్రతిపక్ష సిట్టింగ్‌లను ఎన్నికలకు ముందు పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలా? అలా వచ్చే వారిలో ఎవరున్నారు? అనే విషయాలను ఆరా తీసున్నట్లు తెలుస్తోంది.
అలాంటివారిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉన్న మార్గాలపై కూడా టీఆర్‌ఎస్ దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సిట్టింగ్‌లను మారిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో కూడా కసరత్తు జరుగుతున్నట్లు  తెలుస్తోంది. దీనిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి కలిగిన ఎంపీల స్థానంలో బరిలో దింపడానికి కొందరు ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపీలుగా ఎన్నిక చేసేందుకు కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరుల పేర్లను ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికచేస్తే ఎలా ఉంటుందని అధిష్ఠానం యోచిస్తున్నట్టు భోగట్టా. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తెలిపాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.