నేతలకు టార్గెట్ ఇచ్చిన సీఎం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫీవర్ మొదలైంది. అన్ని పార్టీలు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి ఎన్నికలు పోటా పోటీగా జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అన్ని పార్టీల కంటే ఎక్కువ హడావిడి చేస్తోంది. అధికారం కోసం ఆ పార్టీ స్పీడు పెంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో గులాబీ కోలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల హడావిడే కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల ఇళ్లు మొదలుకుని డివిజన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్ల ఇళ్లవద్ద ఒకటే హడావిడి కొనసాగుతోంది. వారం రోజులుగా అన్ని నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఫంక్షన్‌హాళ్లు, బస్తీల్లో ప్రత్యేక సమావేశాలతో సందడిగా మారాయి. ఇదంతా ఎందుకో అని కంగారు పడకండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతున్న ‘ప్రగతి నివేదన సభ’ కోసం. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ సాధించాలని ప్రయత్నిస్తున్న నేతలు.. తమ నియోజక వర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.

దీంతో అన్నినియోజకవర్గాల్లోనూ గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మరికొన్ని చోట్ల అప్పుడే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల పోస్టర్లు, కటౌట్‌లు వెలిశాయి. ఇంతకు ముందు పార్టీలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. సభకు సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకుంటున్నవారికి ఇదే సరైన అవకాశమని, ఎక్కువ జనసమీకరణ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారట. ఇందుకోసం నియోజకవర్గం నుంచి కనీసం 4000-5000 మందిని సభకు తీసుకురావాలని దిశానిర్ధేశం చేశారని తెలుస్తోంది. అందుకోసమే, పార్టీలోని ఆశావాహులు స్పీడు పెంచేశారని టాక్ వినిపిస్తోంది. తమను తాము నిరూపించుకునేందుకు ‘ప్రగతి నివేదన’ సభకు తమ టార్గెట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ బాధ్యతలను కొందరు మంత్రులు తమ భుజాన వేసుకున్నారని వినికిడి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని నియోజకవర్గాలు చూసుకోవాలని మంత్రులకు కూడా కేసీఆర్ చెప్పారని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.