జ‌గ‌న్‌.. ప‌వ‌న్ భుజాల మీద తుపాకులు.. కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌!

మ‌నిషి పుట్టిన‌ప్పుడు స‌రాస‌రి మెద‌డు బ‌రువు 350-400 గ్రాములు ఉంటుంది. పెద్ద‌వాడ‌య్యేస‌రికి ఇది కాస్తా 1.3కేజీల నుంచి 1.4కేజీల వ‌ర‌కూ పెరుగుతోంది. ఇది మ‌నుషులంద‌రికి ఒకేలా ఉంటుంది. కానీ.. దాన్ని యాక్టివ్ గా ఉంచే విష‌యంలో ఎవ‌రి దారి వారిదే. ఒకే బ‌రువున్న మెద‌డు ఉన్నా.. కొంద‌రి తెలివి అప‌రిమితంగా ఉంటుంది. మిగిలిన రంగాల్ని వ‌దిలేస్తే.. రాజ‌కీయాల్లో మెద‌డు చురుకుద‌న‌మే శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలుస్తుంటుంది.
చురుగ్గా ఆలోచించ‌టం.. ఎత్తులు.. పై ఎత్తుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌ట‌మే కాదు.. ఒక ప‌ట్టాన అర్థం కాన‌ట్లుగా ఉండ‌టం చాలా ముఖ్యం. ఇలాంటి విష‌యాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను వంక పెట్టాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. మ‌నిషి బ‌క్కగా ఉన్నా.. ఎదుటోడు బెదిరేలా.. వ‌ణికేలా చేయ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రం చాలామంది ముఖ్య‌మంత్రుల్ని చూసినా.. కేసీఆర్ త‌ర‌హా సీఎంను మాత్రం చూడ‌లేద‌నే మాట పార్టీల‌కు అతీతంగా అంద‌రి నోటా వినిపిస్తూ ఉంటుంది.
ప్ర‌భుత్వాల‌కు స‌వాలు విసిరే వ్య‌వ‌స్థ‌ల‌ను సైతం త‌న తీరుతో దారికి తెచ్చుకునే స‌త్తా చాలా అరుదుగా చెప్పాలి. అలాంటి తీరు కేసీఆర్ లో ట‌న్నులు ట‌న్నులుగా ఉంటుంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా భారీ ప్ర‌యోజ‌నాన్ని ఆశిస్తున్న కేసీఆర్‌.. ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌టానికి అనూహ్య‌మైన ఆలోచ‌న‌ల్ని చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు లేక‌పోలేదు. అయితే.. కేసీఆర్ పుణ్య‌మా అని అలాంటివేమీ బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. అయితే.. ఎన్నిక‌ల వేడి మొద‌ల‌య్యాక ఇలాంటి అంశాలు తెర మీద‌కు ఆటోమేటిక్ గా వ‌స్తాయి. దీన్ని కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ భారీ ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుతో పాటు.. ప్ర‌త్యర్థుల‌కు లాభం చేకూరే ఓట్ల‌ను చీల్చే వ్యూహాన్ని సిద్ధంగా చేసిన‌ట్లుగా తెలుస్తోంది.
త‌న వ్యూహంలో భాగంగా తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌భావం లేని వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేన‌.. మ‌జ్లిస్ సాయాన్ని తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌జ్లిస్ త‌న మిత్రుడే అని ఇప్ప‌టికే కేసీఆర్ ప‌లుమార్లు ప్ర‌స్తావించినా.. వారితో కలిసి ఉండ‌మ‌న్న మాట‌ను చెప్పారు. అదే రీతిలో.. త‌మ‌ను ఇబ్బంది పెట్టే అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు.. జ‌న‌సేన అభ్య‌ర్థులు నిలిచేలా కేసీఆర్ వ‌ర్క్ వుట్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఈ రెండు పార్టీల‌కు ఉండే సామాజిక ఓట్లే ల‌క్ష్యంగా కేసీఆర్ ఆయా పార్టీల అభ్య‌ర్థులు ఎక్క‌డెక్క‌డ బ‌రిలోకి దిగాలో ఇప్ప‌టికే డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ రెండుపార్టీల‌తో లోగుట్టు అవ‌గాహ‌న‌తో కేసీఆర్ ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని.. త‌న‌కు స‌హ‌క‌రించ‌టం ద్వారా.. త‌న అవ‌స‌ర‌మైన‌ప్పుడు స‌హ‌క‌రించే ఒప్పందంతో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.
అంతే.. కాంగ్రెస్ ను నేరుగా ఢీ కొట్ట‌ట‌మే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. జ‌న‌సేన పార్టీల భుజాల మీద తుపాకులు పెట్టి.. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపే ప్లాన్ ను కేసీఆర్ సిద్ధం చేసిన‌ట్లుగా చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.