కేసీఆర్ ముంద‌స్తు ముచ్చ‌ట !

కేసీఆర్‌… ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు  సిద్ధ‌మా! కాదా! సందేహాలకు ఎవ‌రికి త‌గిన‌ట్లుగా వాళ్లు స‌మాధానాలు వెతుక్కుంటున్నారు. గులాబీపార్టీ  గెలుపోట‌ములు.. ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉండ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ చ‌ర్చ వేడేక్కుతుంది. ఎందుకంటే.. గులాబీబాస్ ఎవ‌రితో పొత్తుకు సై అంటార‌నేది మాత్రం ఇక్క‌డ ఆస‌క్తిక‌రం. దానికి అనుగుణంగా ఏపీలో మిగిలిన పార్టీల‌తో స‌హా టీడీపీ కూడా పొత్తుల‌పై నిర్ణ‌యానికి అవ‌కాశం ఉండ‌దు. అందుకే. కేసీఆర్ వేస్తున్న అడుగుల‌ను బ‌ట్టి మిగతాపార్టీలు స్పందిస్తున్నాయి. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. కేసీఆర్‌కు కాన్ఫిడెన్స్  పెరిగింది. అది సొంత‌బ‌లంపైనా.. లేక విప‌క్ష పార్టీల బ‌ల‌హీన‌త‌తోనా అనేది మాత్రం అడ‌గొద్దు.  ఎందుకంటే..దేశంలో అన్ని పార్టీలు త‌మ బ‌లోపేతంపై గాకుండా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌టంపైనే ఆస‌క్తి చూపుతున్నాయి. 2014లో టీడీపీ, టీఆర్ ఎస్ వ‌ల‌స నేత‌ల‌కు రెడ్‌కార్పెట్ ప‌ర‌చ‌టం వెనుక ఆంత‌ర్యం కూడా అదే. ఇప్పుడు వారంతా బ‌ల‌మా.. లేక‌.. పార్టీకు న‌ష్ట‌మా అనేది కూడా తేల‌నుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. కేసీఆర్ ఇప్ప‌టికే దాదాపు ఆరు స‌ర్వేలు చేయించానంటారు. నాలుగింట్లో కారు దూసుకెళ్ల‌బోతుందంటూ నివేదిక‌లు వ‌చ్చాయ‌ట‌. పైగా ఢిల్లీ నుంచి వ‌చ్చిన టీమ్ ఏకంగా 100 సీట్లు మీకే కేసీఆర్ సాబ్ అంటూ గ‌ట్టిగా చెప్ప‌టంతో బాస్‌.. ఇక లాభంలేదు.. కాంగ్రెస్ బ‌లోపేతం కాక‌ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే భావ‌న‌కు వ‌చ్చాడు. అయితే కేబినెట్‌లో కొంద‌రు మంత్రులు వ‌ద్ద‌ని వారించినా.. న‌య్ అంటూ త‌న మాట‌నే చెల్లుబాటు అయ్యేందుకు ఉన్న మార్గాల‌ను అన్వేషించే ప‌నిలో కేసీఆర్ వ్యూహర‌చ‌న చేస్తున్నార‌ట‌. 
దానిలో భాగంగానే తెలంగాణ‌లో కీల‌క‌మైన ముగ్గురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేశార‌నే వాద‌న వినిపిస్తుంది. రాజ‌కీయాల్లో భాగంగానే అధికారుల బ‌దిలీలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. స‌మ‌ర్థులు.. అధికార పార్టీకు అనుకూలంగా ఉండే..  ఉన్న‌తాధికారుల‌కు.. కీల‌క‌మైన పోస్టులు ఇచ్చేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తుందంటూ విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. అటువంటి చోట‌.. త‌మ‌వాళ్లు ఉంటే.. బావుంటుందంటూ.. అధికార పార్టీలు  ఎన్నిక‌ల‌కు కొద్దినెల‌ల ముందు ఇటువంటి అక‌స్మిక బ‌దిలీల‌కు శ్రీకారం చుట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణం. దానిలో భాగంగానే జీహ‌చ్ంసీ , హెచ్ఎండీఏ, జ‌ల‌మండ‌లి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే ఐఏఎస్ అధికారులు బి.జ‌నార్ద‌న్‌రెడ్డి, దానకిషోర్‌, చిరంజీవులు బ‌దిలీలంటూ ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఈ లెక్క‌న‌.. కేసీఆర్ ముంద‌స్తు వ్యూహంపై రెండుమూడ్రోజుల్లో క్లారిటీ రావ‌చ్చ‌నేది గులాబీ శ్రేణుల అంత‌రంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.