స్వయంగా నీ కొడుకే చెప్పారు.. మర్చిపోయావా కేసీఆర్? 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఈ ఇద్దరికీ ఏదో ఒక రూపేన కావాల్సినంత ప్రచారం లభిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయాణం మొదలెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ మాత్రం ఆయనకే దెబ్బేసే పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లూ తెలంగాణాలో ఏదో మాటల మాయచేసి మరోసారి పీఠమెక్కాను కదా! అని ఇతర రాష్ట్రాల్లో కూడా అవే మాటలను నమ్ముకుంటే.. ఇక ఆయన్నెవ్వరు నమ్మేది. భూత, భవిష్యత్ పరిణామాలను పరిగణలోకి  తీసుకోకుండా నోటికేదొస్తే అదే మాట్లాడటం కేసీఆర్‌కే పెద్ద అపవాదు తెస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఇటీవలే ఓ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్..  అస‌లు హైద‌రాబాద్‌లో ఐటీకి పునాదులు వేసింది మాజీ పీఎం రాహుల్‌గాంధీ, మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి అని వ్యాఖ్యానించటం పలు చర్చలకు దారి తీసింది. దీంతో.. భవిష్యత్ డ్రామాలు చెప్పి ఫూల్స్ చెయ్యొచ్చు కానీ ఇలా జరిగిన గతాన్ని నీకనువుగా మార్చేసి చెప్తే ఇక్కడ ఫూల్ అయ్యేది నీవే! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఈ రోజు తెలంగాణలో ఐటీ పరిశ్రమ రాజ్యమేలుతుందంటే.. దానికి కారణం చంద్రబాబు. ఈ విషయం హైద‌రాబాద్‌లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఐటీ అంటే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని గుర్తించేలా ఒక కేరాఫ్‌గా మార్చిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు. నాడు మైక్రోసాఫ్ట్ అధినేత, ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌ని ఒప్పించి ఆ కంపెనీని హైద‌రాబాద్‌కి రప్పించిన ఘనత బాబుది. ఈ సంగతి మనం చెప్పటం కాదు.. ఓ సందర్భంలో స్వయంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ స్వ‌యంగా ఐటీ ఉద్యోగిగా పనిచేసి వ‌చ్చారు. ఆయ‌న అమెరికాలో మాస్ట‌ర్స్ చ‌దివింది కూడా ఐటీలోనే. హైదరాబాద్ ఐటీ గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. హైద‌రాబాద్ సైబ‌రాబాద్‌గా మారిందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం చంద్రబాబు నాయుడు చేసిన కృషియే.. అని కూడా ఆయన చెప్పారు. నాడు హైటెక్‌సిటీతో చంద్ర‌బాబు నాయుడు వేసిన విజ‌న్‌.. నేడు ఇంతింతై వటుడింతై అన్న‌ట్లుగా శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించి ఇవ్వాళ తెలంగాణ‌కు సంవ‌త్స‌రానికి సుమారు 60 వేల కోట్ల‌రూపాయ‌ల మేర ఆదాయం స‌మ‌కూరేలా చేస్తోంది. ఈ ఆదాయంతోనే కేసీఆర్ చేస్తున్న అనేక ప‌థ‌కాల‌కు ఊపిరిపోస్తున్నార‌ని ఆర్ధిక నిపుణులు సైతం అంగీక‌రిస్తున్న వాస్త‌వం.
అలాంటిది.. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ఓ ఆధారం లేకుండా కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం హాట్‌టాపిక్ అవుతోంది. మిడి మిడి జ్ఞానంతో, మాయ మాటలతో ఇంకెన్నాళ్లు జనాన్ని మోసం చేస్తాడో ఆ పెద్దమనిషి అనే టాక్ వినిపిస్తోంది జనాల్లో! ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కి ఎంత వరకు మద్దతు లభిస్తుందో చూడాలి మరి.    

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.