అప్పుడు వైఎస్సార్ కోసం.. ఇప్పుడు కేసీఆర్ కోసం.. నాలుక కోసుకున్నాడు

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల వల్ల ఎన్నో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లోనైతే గతంలో ఎన్నడూ చూడని వింతలు కూడా ఈ ఎన్నికల వల్ల చూడాల్సి వస్తుంది. ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, ప్రజాకూటమి సహా మిగిలిన పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ప్రచారం కూడా అయిపోవడంతో ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మిగిలిన మార్గాలను అన్వేషిస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. శుక్రవారం జరిగే ఎన్నికల కోసం తెలంగాణతో పాటు, అటు ఆంధ్రా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులే కాదు.. ఎవరు ఏది చేసినా సంచలనం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన సంచలనం అవడమేమోగానీ, అభిమానం అంటే ఇలా ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని కలిగించింది.

అభిమానం అనేది ఏ రంగంలోనైనా పరిమితి మించనంత వరకు ఓకే. కానీ, శ్రుతి మించితే మాత్రం క్రూరత్వం అవుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గుడిలకు చెందిన చేవెళ్ల మహేశ్‌ అనే యువకుడు.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నాలుక కోసుకున్నాడు. బుధవారం శ్రీనగర్‌ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హనుమాన్‌ దేవాలయానికి వెళ్లాడు. బ్లేడుతో నాలుక కోసుకుని ముడుపుగా హుండీలో వేశాడు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది మహేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. మహేశ్ నాలుక కోసుకోవడానికి అసలు కారణం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని, కేసీఆర్‌ సీఎం కావాలని మొక్కుకోవడమేనని తెలిసింది. ఈ యువకుడు ఇలా చేయడం ఇది తొలిసారి కాదట. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కూడా నాలుకను కోసుకున్నాడని అతడి బంధువులు చెబుతున్నారు. దీనితో పాటు ఇతడు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. మొక్కు మాట దేవుడెరుగు కానీ, ఈ పనితో అంతా అవాక్కవడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.