సాయం కోసం చంద్రబాబును కలిసిన కేసీఆర్ అన్న కూతురు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా, ఆయా పార్టీల నేతలు మాత్రం సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన పార్టీలలో కొన్ని కూడా అదే బాటలో పయనించాయి. అయితే, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన చేయలేదు. దీంతో కూటమిలోని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు టికెట్ కోసం అధిష్ఠానాలకు అర్జీలు పెట్టుకుంటున్నారు. టీటీడీపీ నేతలైతే అమరావతి వెళ్లి మరీ చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే, తెలంగాణలో రాజకీయం వేడెక్కిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు అమరావతిలో చంద్రబాబును కలిశారు.

పేరుకు కేసీఆర్ బంధువే అయినా.. ఆ పార్టీ అంటే పడని రమ్య రావు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆమె ముందస్తు ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించేందుకు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమ్య.. టీడీపీ అధినేతను కలవడం చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ వైఖరితో మనస్థాపంతో ఉన్న ఆమె.. టికెట్ కేటాయింపు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సాయం కోరారని సమాచారం. అలా కాకపోయినా.. టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమని ఆమె చెప్పినట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకున్న కారణంగా ఆమె చేరికను సున్నితంగా తిరస్కరించారని, అదే విధంగా టికెట్ విషయమై కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు వినికిడి. టీటీడీపీ నేతలు ఆమెను పార్టీలో చేర్చుకోవాలని ఆసక్తి చూపినా.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నదని వారిని సముదాయించినట్లు టాక్ వినిపిస్తుంది. తన సోదరుడు రంగారావు కుమార్తె అయిన రమ్య రావుకు కేసీఆరే స్వయంగా కన్యాదానం చేశారు. అయితే, ఆమె మొదట్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలో చేరారు. విభజనానంతరం జరిగిన ఎన్నికల తర్వాత అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్ష్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి రమ్య ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.