స‌భ‌కు ముందు కేబినెట్ మీటింగ్‌.. ఎందుకు?

అంచ‌నాల‌కు తెర ప‌డింది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం ఎప్పుడెప్పుడా అని జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. పాతిక ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన రోజున హ‌డావుడిగా ఉండే వేళ‌.. స‌భ ప్రారంభం కావ‌టానికి మూడు గంట‌ల ముందు కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
వాస్త‌వానికి ఇంత భారీ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ప్పుడు మంత్రులంద‌రికి ఒక్కో బాధ్య‌త అప్ప‌గించి… వాటిని మానిట‌ర్ చేయించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా మంత్రివ‌ర్గ భేటీ నిర్వ‌హించ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స‌భ‌కు కొద్ది గంట‌ల ముందు ఏర్పాటు చేస్తున్న కేబినెట్ భేటీ కావ‌టం.. ముంద‌స్తు మాట‌లు భారీగా వినిపిస్తున్న వేళ‌.. కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందంటున్నారు.
ప్ర‌జ‌ల‌కు తానేం చెప్పాల‌నుకున్నానో.. ఆ విష‌యాన్ని నేరుగా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌టం కేసీఆర్ కు అల‌వాటు. కానీ.. ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యం తీసుకున్నామ‌న్న భావ‌న‌ను క‌లిగించేందుకు వీలుగా  మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ముందురోజు (శ‌నివారం) కేబినెట్ భేటీకి అవ‌కాశం ఉన్నా..అందులో చ‌ర్చించిన అంశాలు మీడియాలోకి వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌న్న ఉద్దేశంతో షెడ్యూల్ ను మార్చిన‌ట్లుగా తెలుస్తోంది.
స‌భ ప్రారంభం కావ‌టానికి కాస్త ముందుగా భేటీ నిర్వ‌హించ‌టం ద్వారా.. అక్క‌డ చ‌ర్చించే అంశాలు అప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుండ‌దు. అదే స‌మ‌యంలో.. మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు చెప్పే మాట‌ల్ని స‌భ‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో కూడా పంచుకునే అవ‌కాశం ఉందంటున్నారు.
ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. ముంద‌స్తుకు వెళ్లే నిర్ణయాన్ని కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ఇందులో నిజం లేద‌నే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల వ్య‌వ‌హారంకానీ.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే అంశం కానీ అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హించిన త‌ర్వాత కానీ.. చివ‌రి రోజున కానీ ప్ర‌క‌టించే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఏమీ చెప్ప‌న‌ప్పుడు కేబినెట్ మీటింగ్ ఎందుకు? అన్న‌ప్ర‌శ్న త‌లెత్త వ‌చ్చు. స‌భ నేప‌థ్యంలో ప్ర‌క‌టించే ప‌లు తాయిలాల‌కు సంబంధించి అధికారికంగా మంత్రివ‌ర్గ ఆమోదం ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. దీని కోస‌మే త‌ప్పించి.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప్ర‌త్యేక కార‌ణం ఏమీ లేద‌న్న భావ‌నను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. 
ఇదిలా ఉంటే.. సంచ‌ల‌న స‌భ నుంచి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలను ప్ర‌క‌టిస్తార‌ని.. ఒక‌వేళ స‌భ‌ను ర‌ద్దు చేసే అంశాన్ని.. ముంద‌స్తుకు వెళ్లే అంశాన్ని ప్ర‌క‌టించే వీలుంద‌న్న వాద‌న వినిపిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంద‌స్తు అంశాన్ని అశేష ప్ర‌జానీకం ముందు వెల్ల‌డించి.. అనంత‌రం శాస‌న‌స‌భ ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించే ప‌రిస్థితి ఉండ‌ద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భారీ బ‌హిరంగ స‌భ ముందు.. మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లుగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న కొత్త ఊహాగానాల‌కు తెర తీసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.