‘కవచం’ మూవీ రివ్యూ

సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే, పోసాని, స‌త్యం రాజేష్‌ తదితరులు
కెమెరా: చోటా.కె.నాయుడు
ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్
సంగీతం: ఎస్ .ఎస్‌. థ‌మ‌న్‌
నిర్మాత‌: న‌వీన్ శొంఠినేని
స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : శ్రీనివాస్ మామిళ్ల‌

నిర్మాత కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసినా.. నటన మీద తపనతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి చిత్రంతోనే మంచి వసూళ్లను సాధించిన శ్రీనివాస్.. ‘జయ జానకీ నాయక’తో మంచి హిట్ కొట్టాడు. నిర్మాత కొడుకు కావడంతో ఆయన ప్రతి సినిమాలో హైలెవెల్ మేకింగ్‌తో తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలకే పరిమితమైన బెల్లంకొండ వారి అబ్బాయి.. ‘సాక్ష్యం’ వంటి కాన్సెప్ట్ మూవీతో వచ్చాడు. అది ఆశించిన మేర ఆడలేదు. దీంతో ఇప్పుడు పోలీస్ బ్యాగ్‌డ్రాప్ మూవీతో వచ్చాడు. అదే ‘కవచం’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు చాలా కాలం తర్వాత కాజల్ తెలుగు తెరపై కనిపించనుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ‘కవచం’ శ్రీనివాస్ కెరీర్‌ను మలుపు తిప్పిందా..? లేక మరో ఫ్లాప్‌ను అతడి ఖాతాలో వేసిందా..?

కథ
నిజాయితీ, క్రమశిక్షణ గల పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు పరితపిస్తుంటాడు. అందుకోసం తనకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికీ సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి పర్స్ పోతుంది. అది ఓ అమ్మాయి (కాజల్) తీసుకొచ్చి ఇస్తుంది. ఆ అమ్మాయి ప్రవర్తన నచ్చి ఆమె ప్రేమలో పడిపోతాడు విజయ్. ఇంతలోనే ఆమె గురించి అతడికో నిజం తెలిసి దూరమైపోతాడు. అదే సమయంలో విజయ్‌కు సంయుక్త (మెహరీన్) పరిచయం అవుతుంది. ఆమెను ఓ ప్రమాదం నుంచి కాపాడాతాడు. సరిగ్గా అప్పుడే విజయ్ తల్లికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దాని కోసం సంయుక్త అతడికి హెల్ప్ చేస్తుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో విజయ్ ఓ కిడ్నాప్ కేసులో చిక్కుకుంటాడు. అదే సమయంలో సంయుక్త గురించి ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ సంయుక్త ఎవరు..? విజయ్‌కు ఎందుకు సహాయం చేసింది..? అసలు పర్స్ తీసుకొచ్చిచ్చిన అమ్మాయి ఎవరు..? విజయ్ ఎవరిని కిడ్నాప్ చేశాడు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
పోలీస్ కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాంటి కథతో రావడంతో పాత సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు కొత్త పాయింట్ తీసుకున్నా పాత కథలా అనిపిస్తుంది. అయితే, దర్శకుడు మాత్రం సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. మొదటి సినిమా కావడంతో అతడి అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ.. కథనం అనుకున్నంత స్థాయిలో లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. అలాగే సినిమాలో ఉన్న ట్విస్టులు ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తాయి. మొత్తంగా ‘కవచం’ మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది.

నటీనటుల పనితీరు
ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. అదే సమయంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సరిపోయాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ సన్నివేశాల్లో గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్లుగా నటించిన కాజల్.. గ్లామరస్‌గా కనిపించింది. అలాగే తన పాత్ర పరిధి మేర నటించింది. మరో హీరోయిన్ మెహరీన్ కనిపించింది కాసేపే అయినా.. చక్కగా నటించింది. తన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో మంచి పాత్రను పోషించింది. విలన్‌గా నటించిన నిల్ నితిన్ ముఖేష్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మెరకు బాగానే నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు మంచి పాయింట్‌ను తీసుకున్నాడు కానీ, దానికి తగిన విధంగా కథనాన్ని నడిపించలేకపోయాడు. అయితే, మొదటి సినిమానే అయినా కొన్ని సీన్లలో పరిణితిని కనబరిచాడు. థమన్ సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించినా, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక సినిమాటోగ్రఫర్ చోటా కె. నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. అలాగే చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, ఆయన తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

బలాలు
* బెల్లంకొండ సాయి శ్రీనివాస్
* దర్శకుడు ఎంచుకున్న పాయింట్
* కొన్ని సన్నివేశాలు
* థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు
* కథనం
* సెకెండాఫ్ బోరింగ్‌గా అనిపించడం
* అవసరానికి మించిన ట్విస్టులు

మొత్తంగా: ఈ పోలీస్ మాస్ ప్రేక్షకులకే

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.