కత్తి మహేశ్ ఇక ఏపీలోనే ఉంటాడట.. వైసీపీ కోసమేనా..?

కత్తి మహేశ్.. బిగ్‌బాస్ రాకముందు వరకూ ఒక సినీ విమర్శకుడిగా తెలిసిన వ్యక్తి. ఆ షో పుణ్యమా అని ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. దీనితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారాడు. ఇక అప్పటి నుంచి కొన్ని నెలలపాటు పవన్ అభిమానులతో పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో ఏ చానెల్‌లో చూసినా ఆయన గురించే చర్చలు.. ఆయనతోనే చర్చలు. ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయాడు. కొద్దిరోజులకు పవన్ ఫ్యాన్స్‌తో జరుగుతున్న పోరాటానికి పుల్‌స్టాప్ పెట్టిన ఆయన.. సినిమాకు రివ్యూలు ఇవ్వడం వరకు ఆగిపోయాడు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలకు టీవీ చర్చా కార్యక్రమాలకు హాజరవడం తన అభిప్రాయాన్ని వెల్లడించడం వంటివి చేస్తుండేవాడు. అయితే, ఆ మధ్య ఓ కార్యక్రమంలో శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని ఆదేశించారు.

అంతేకాదు, ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో ఏపీలోనూ కత్తి మహేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక అప్పటి నుంచి ఆయన పెద్దగా కనిపించలేదు.. కనిపించినా మీడియా కూడా పట్టించుకోలేదు. తాజాగా కత్తి గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తినేనని… తనపై హైదరాబాద్ సిటీలో నిషేధం మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కాకుండా ఇంకా ఎక్కడైనా నివసించవచ్చని… తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వాడిని కాబట్టి ఇక నుంచి విజయవాడలో ఉండేందుకు గన్నవరం వచ్చానని తెలిపాడు. మరోవైపు కత్తి మహేశ్‌.. ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన విజయవాడ వచ్చాడని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేశాడని, ఇప్పుడు కూడా ఆ పార్టీ కోసమే వ్యూహాలు రచించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయబోతున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.