క‌న్నా నీకిది త‌గునా?.. హోదా అడిగితే మ‌క్కెలిర‌గ‌దీస్తారా?

ప్రత్యేకహోదా  అనేది ముగిసిన అధ్యాయమ‌ని తీర్మానించేసుకున్న బీజేపీ, ఎవరైనా  ప్రత్యేకహోదా కోసం నిలదీస్తే వారి మ‌క్కెలిర‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.  ప్రకాశం జిల్లాలో  బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పర్యటన సందర్భంగా జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. క‌న్నా ప‌ర్య‌ట‌న‌లో ఒక వ్య‌క్తి  ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాలి.. అనే ప్లకార్డ్‌ ప్రదర్శించడంతో, అతన్ని పట్టుకుని  స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు చిత‌గ్గొట్టేశారు. మ‌రోవైపు కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచీ,  ఆయ‌న ఎక్క‌డ‌ పర్యటించినా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ-టీడీపీ ల మ‌ధ్య తెగ‌తెంపులు అయిన ద‌గ్గ‌రి నుంచీ ఈ తరహా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇటీవల తిరుపతిలో పర్యటించినప్పుడు కూడా ఇలానే జ‌రిగింది. ఆయన వెంట కాన్వాయ్‌గా వెళ్ళిన వాహనాల్లో ఒక వాహనంపై దాడి జరిగింది. దీనికి టీడీపీనే కారణమంటూ అప్పట్లో బీజేపీ నేతలు ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనిని మ‌ర‌చిపోతున్నంత‌లో ఇటీవలే కన్నా లక్ష్మినారాయణపై ఒక వ్య‌క్తి చెప్పు విసిరాడు. దీంతో ఆగ్ర‌హించిన బీజేపీ నేత‌లు అతన్ని  చావ‌బాదారు.
తాజాగా ప్ర‌కాశం జిల్లాలో బీపేపీ నేత‌ల ముందు ఒక వ్య‌క్తి  ‘ప్రత్యేకహోదా’ ప్లకార్డు పట్టుకున్నాడు. అప్పుడు కూడా బీజేపీ నేతలు అతనిపై త‌మ జులుం ప్ర‌ద‌ర్శించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, బాధితుడిని వారు బారి నుంచి విడిపించి ర‌క్షించారు. 2014 ఎన్నికల సమయంలో  ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పదేళ్ళపాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. ఇదే సంద‌ర్భంలో టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా  పదిహేనేళ్ళు అవసరమని చెప్పారు. ఆ తర్వాత ఈ జాబితాలోని వారంతా మాట‌మార్చేశారు. అయితే  వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాల‌తో, ప్రత్యేకహోదా ఉద్యమానికి టీడీపీ కూడా ఉద్య‌మానికి దిగింది. అయితే తాజాగా బీజేపీ… ప్రత్యేకహోదా పెరెత్తితే అగ్గిమీద గుగ్గిలమైపోతోంది. ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు టీడీపీ నే కార‌ణ‌మ‌ని కూడా ఆరోపించ‌డం విచిత్రం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.