టీడీపీలో చేరిన కమల

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వలసలు కూడా జోరందుకుంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోని నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న పార్టీలన్నీ నేతల కోసం తలుపులు తెరిచి ఉంచాయి. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ.. అందుకోసం అనేక వ్యూహాలు సిద్ధం చేసి ఉంచింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటివి తమను గెలిపిస్తాయని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కానీ, మిగిలిన పార్టీలను బలపడనీయకుండా ఉండేందుకు చాలా మంది నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు.

తాజాగా ఆ పార్టీలో మరో కీలక నేత చేరిపోయారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కమలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు సైతం సైకిలెక్కారు. ఆమె మొదట మంగళగిరిలోని సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి తన అనుచరులు అభిమానులతో భారీ ర్యాలీగా ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దకు చేరుకుని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కమల వెల్లడించారు. ఇదిలాఉండగా, 2009 ఎన్నికల్లో కమల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆమె సైలెంట్‌గా ఉండిపోయారు. అందుకే 2014లో పోటీ చేయలేదు. అయితే, కమలను టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చేర్చుకున్నారా..? లేక బేషరుతుగా చేరారా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కమల చేరికతో మంగళగిరిలో టీడీపీ బలం పెరిగే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.