చందులాల్ పై అధిష్టానం సీరియ‌స్‌

మేడారం.. ఈ పేరు వింటేనే కోట్లాది హృదయాలు పులకరిస్తాయి.. ముక్కోటి గొంతుకలు ఒక్కటై నీరాజనరాగం వినిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనల కోసం పరుగెత్తుతాయి. ఎక్కడెక్కడినుంచో మేడారం దిశగా కదులుతాయి. ఏయేటికాయేడు పెరుగుతున్న జనం.. అంతకుమించిన జాతరపై విశ్వాసం.. వెరసి మేడారం జనప్రవాహమవుతోంది. జనం జనం ప్రభంజనమై కదిలే సమయం దగ్గరపడింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సమయం ఆసన్నమైంది. దక్షిణాసియాలో పెద్ద జాతరగా.. భారతదేశంలో జరిగే జాతరలన్నిటిలో అతిపెద్ద ఆదివాసీ జాతరగా వెలుగొందుతున్న మేడారం రాష్ట్రీయ పండుగగా గుర్తింపు పొందినా.. జాతీయ పర్వదిన హోదా మాత్రం దక్కించుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్రానికి వినతులు సమర్పిస్తున్నా.. లాభం లేకపోయింది. అయినా.. తమ వంతుగా తమ జాతరను సమర్ధతంగా నిర్వహించడానికి జాతరకు ఈసారి 80 కోట్లరూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఆ దిశగా పనులను నిర్వహించాలని ఆదేశించింది. మేడారం జాతరపై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజనశాఖా మంత్రి చందూలాల్ అసలు జాతర విషయంలో పెద్ద పాత్ర పోషించలేకపోయారనే చెప్పాలి. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జాతరను పట్టించుకోలేకపోయిన చందూలాల్ కనీసం ఆ బాధ్యతలను మొదట్లోనే ఎవరైనా సీనియర్ నేతలకు అప్పగించాల్సి ఉండేది. కానీ తన ఆధిపత్యం ఎక్కడ కోల్పోతానన్న భయంతో చందూలాల్ అసలు ఆ దిశగా ఆలోచించలేదు.. దీంతో ఇత‌ర మంత్రులు రంగంలో దిగారు. ప‌నులు చ‌క్క‌బెట్టారు. అయితే చివరి నిముషంలో చందూలాల్ సార్‌కు కోపమొచ్చింది. తన నియోజకవర్గంలో ఇతరుల ఆధిపత్యం ఏంటంటూ చిర్రుబుర్రులాడుతున్నారట! అసలు తాను జాతరకే రాను పొమ్మంటూ తన సన్నిహితులతో చిందులు తొక్కినట్లు సమాచారం. నిన్నగాక మొన్న జాతర ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డిలతో పాటు మంత్రి చందూలాల్ కూర్చున్నప్పటికీ.. తనకు పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదన్న అక్కసుతో చందూలాల్ ఉండగా.. ఆ తర్వాత కడియం స్వయంగా మేడారం జాతరలో పాగా వేసి పనులను సమీక్షిస్తూ అధికారులను మందలిస్తూ.. జాతరకు వచ్చిన భక్తులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాటి పరిష్కారం దిశగా ప్రయత్నించడం కూడా చందూలాల్‌కు నచ్చడం లేదు. తన ఇలాఖాలో కడియంకు ఏం పని అంటూ కోపంతో ఉన్నారట..! తనను సంప్రదించకుండా.. తన అనుమతి లేకుండానే జాతరలో నిద్ర చేసిన కడియంను మొత్తం జాతర చేసుకోమనండి.. అంతే తప్ప తనముచ్చట మాత్రం మాట్లాడొద్దంటూ సన్నిహితులతో చందూలాల్ అంటున్నారట..! ‘కనీసం జాతరలో సమీక్ష చేస్తున్నాను.. అక్కడికి రావాలంటూ తనకు చెప్పాలి కదా.. తనతో పాటు కలిసి మంత్రిగా పనిచేశాను.. సీనియర్ అయిన నన్ను కాదని నా నియోజకవర్గంలో ఈయనగారి పెత్తనమేంటి’ అంటూ సీఎంకు చెప్పడానికి సిద్ధమైనట్లు సమచారం. అయితే కడియంను సాక్షాత్తు సీఎం కేసీఆరే మేడారం నిర్వహించాలంటూ పంపించినట్లు కడియం వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. భక్త జనసంద్రంగా మారిన మేడారం జాతరకు పట్టిన రాజకీయ గ్రహణాలు వీడాలనేది భక్తుల కోరిక. ఒకవైపు బుధవారం చంద్రగ్రహణం నేపథ్యంలో జాతరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని పూజారులు చెబుతుండగా.. రాజకీయంగా మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందోనని ములుగు రెవెన్యూ డివిజన్ టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రకృతిపరంగా ఆదివాసీల ఆరాధ్యదైవాలను కొలిచే వేళ కడియం వర్సెస్ చందూలాల్ అంశంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు.. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాలు పట్టించుకోవలసిన స్థానిక నేతల చిత్తశుద్ధిలేమిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.