విజయ్ ఆంటోని ‘కాశి’ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: లెజెండ్ సినిమా
న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోని, అంజ‌లి, సునైన‌, అమృతా అయ్య‌ర్, నాజ‌ర్‌, ఆర్‌.కె.స్వామి, మ‌ధుసూదన్‌, వేల రామ‌మూర్తి త‌దిత‌రులు
సంగీతం: విజ‌య్ ఆంటోని
కూర్పు: లారెన్స్ కిశోర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: రిచ‌ర్డ్ ఎం.నాథ‌న్‌
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృతిక ఉదయనిధి

‘బిచ్చగాడు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ ఆంటోని. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో విజయ్ ఆంటోని హీరోగా నిలదొక్కుకుని సినిమాలు చేయడం ప్రారంభించాడు. అయితే విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన భేతాళుడు, యెమన్, ఇంద్రసేన చిత్రాలు హ్యాట్రిక్ ప్లాఫ్‌ను కట్టబెట్టాయి. కానీ విజయ్ ఆంటోని సినిమాల్లో ఏదో కొత్తదనం ఉంటుందని భావించి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎక్కువగానే ఉన్నారు. తెలుగులో త‌న‌కున్న ఆ మార్కెట్ దృష్ట్యా విజ‌య్ ఆంటోని చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే ‘కాశి’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిచ్చ‌గాడు సినిమా త‌ర్వాత వరుస ప్లాఫ్‌ల్లో ఉన్న విజయ్ ఆంటోనికి ఈ సినిమా అయినా విజ‌యాన్ని ఇచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:
భ‌ర‌త్ (విజ‌య్ ఆంటోని) అమెరికాలో పేరు మోసిన డాక్ట‌ర్‌. వాళ్ల నాన్న కూడా డాక్ట‌రే. వాళ్ల‌కి ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాంచీలు ఉంటాయి. చూసినవాళ్లు అసూయపడేంత గొప్పగా ఉంటుంది భరత్ లైఫ్. అయితే అన్నీ ఉన్నా.. ఏదో ఓ కల అతడికి పదేపదే గుర్తొస్తుంటుంది. ఓ సారి క్రిటికల్ ఆప‌రేష‌న్ చేస్తున్న భ‌ర‌త్‌కి అత‌ని త‌ల్లి అస్వ‌స్త‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తుంది. ప‌రీక్ష‌లు చేస్తే ఆమెకు రెండు కిడ్నీలు ఫెయిల‌యిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. త‌ల్లికి త‌న కిడ్నీని ఇవ్వ‌డానికి ముందుకొస్తాడు భ‌ర‌త్‌. ఆ క్ర‌మంలో ఆమె అత‌ని సొంత త‌ల్లి కాద‌ని అర్థ‌మ‌వుతుంది. దాంతో తన సొంత త‌ల్లిదండ్రుల‌ు ఎవరు? తనకు ఆ కల ఎందుకు వస్తోందో తెలుసుకోవడానికి ఇండియాకు చేరుకుంటాడు భరత్. తనను అనాథ ఆశ్రమంలో ఎవరు చేర్పించారు అనే విషయాలను సేకరించే పనిలో ఉన్న భరత్‌కు తన తల్లి చనిపోయిందనే విషయం తెలుస్తుంది. దీంతో తన తల్లికి ద్రోహం చేసిన తండ్రి ఎవరనేది తెలుసుకోవాలని నిర్ణయించి అతడి కోసం వెతకడం ప్రారంభిస్తాడు భరత్. ఈ క్రమంలో అతడికి ఓ నాటు వైద్యురాలు(అంజలి) పరిచయం అవుతుంది. ఉచిత వైద్యం పేరుతో ఆ ఊళ్లో ఉన్న వాళ్లందరి డీఎన్‌ఏను సేకరించి తన తండ్రిని గుర్తించే పనిలో పడతాడు భరత్. ఈ క్రమంలో మరో రెండుమూడు స్టోరీలు తెరపైకి వస్తాయి. ఆ స్టోరీలకు, భరత్‌కు ఏంటి సంబంధం? తండ్రి కళ్ల ముందు ఉన్నా గుర్తించే అవకాశం లేని భరత్‌కు నిజం ఎలా తెలుస్తుంది? అనేది మిగతా కథనం.


ప్ల‌స్ పాయింట్లు
విజ‌య్ ఆంటోని న‌ట‌న‌
నేప‌థ్య సంగీతం
సునైన న‌ట‌న‌

మైన‌స్ పాయింట్లు
స్క్రీన్‌ప్లే
పాట‌లు
రీరికార్డింగ్
సాగ‌దీసిన‌ట్టున్న క‌థ‌నం
ల‌వ్‌స్టోరీ ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం
కథకు తగ్గ కామెడీ లేకపోవడం

విశ్లేష‌ణ‌
విజ‌య్ ఆంటోని సినిమా అన‌గానే ఏదో కొత్త‌ద‌నం ఉంద‌నే ఆలోచ‌న ప్రేక్ష‌కులకు క‌లుగుతుంది. దానికి తోడు తొలి ఏడు నిమిషాల సినిమాను ముందుగానే విడుద‌ల చేశారు. ఆ ఏడు నిమిషాల‌ను చూసిన వారికి సినిమా త‌ప్ప‌కుండా బావుంటుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఒక వ్య‌క్తికి పాము క‌ల్లోకి రావ‌డం, ఎద్దు పొడ‌వ‌డానికి వ‌చ్చిన‌ట్టు త‌ర‌మ‌డం వంటివి ఆ ఏడు నిమిషాల్లో క‌నిపించాయి. హీరో గ‌తానికి వాటికీ సంబంధం ఉంద‌నే అంశాన్ని సినిమాలో చూపించారు. ఎద్దు వ‌ర‌కు స‌రేగానీ, పాము ఎందుకు కనిపిస్తుందో లాజిక్ లేదు. ‘రంగస్థలం’ సినిమాలో కనిపించిన పాముగానే ఈ సినిమాలో పాము కూడా మిగిలిపోతుంది. ఈ సినిమాలో అంద‌రినీ పాజిటివ్‌గా చూపించాల‌నే ప్ర‌య‌త్నం జ‌రిగింది. త‌న త‌ల్లిని వెతుక్కుంటూ వెళ్లే హీరోకి ఎదురైన క‌థ‌లు పంటికింద రాయిలా అనిపిస్తాయి. ఏ క‌థ‌కు ఆ క‌థే కొత్త‌గా అనిపించినప్ప‌టికీ.. అవి అసలు కథలో మిళితం కాలేకపోయాయి. ఫస్ట్‌హాఫ్ ఒక పావుగంట తప్పించి మిగతా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో ట్విస్టులు కూడా ఏమీ లేవు. భరత్ తండ్రి ఎవరో క్లయిమాక్స్‌కు 20 నిమిషాల ముందే తెలివైన ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇందులో ఏ సెంటిమెంట్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. హీరో హీరోయిన్ల మ‌ధ్య సరైన కెమిస్ట్రీ లేదు. త‌ల్లిదండ్రుల కోసం వెతికే కొడుకులో ఉండాల్సిన కంగారు, ఆందోళ‌న వంటివి ఏవీ హీరోలో క‌నిపించ‌వు. అయితే ఈ సినిమాలో విజయ్ ఆంటోని మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యంలో వచ్చిన ఆ పాత్రల్లో విజయ్ ఆంటోని కాస్త ఫరవాలేదనిపించినా.. అసలు కథలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బాహుబలిలో బిజ్జలదేవ లాంటి పాత్ర చేసిన నాజర్ ఇందులో ప్రాధాన్యంలేని పాత్రను చేశారు. మిగతానటీనటులు తమ పరిధిమేరకు నటించారు.

ఇక పాట‌లు కూడా బ‌లంగా లేవు. తొలి పాట‌ మదర్ సెంటిమెంట్‌తో ఉండేసరికి ఈ సినిమా కూడా ‘బిచ్చగాడు’లా ఉంటుందేమో అని ఎంతో ఆసక్తిగా సీట్లకు అతుక్కుపోయే ప్రేక్షకులకు కొద్దిసేపటి తరువాత ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని చెప్పాలనుకున్న దర్శకుడు.. దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చూపించలేకపోయాడు. అక్కడక్కడ కొన్ని డైలాగులు బాగున్నా.. సాగదీత కథనంతో బోర్ కొట్టించాడు. `బిచ్చగాడు` త‌ర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజ‌య్ ఆంటోనీకి `కాశి` నిరాశ‌నే మిగులుస్తుందని చెప్పాలి. కొత్త‌దనాన్ని ఆహ్వానించే ప్రేక్ష‌కులు ఒక‌సారి చూడొచ్చు.

చివరిగా: కాశి.. ‘బిచ్చగాడు’ కాలేకపోయాడు

రేటింగ్‌: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.