జేడీఎస్‌కు అమావాస్య భయం

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా వీక్షించిన కర్నాటక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. దీంతో ఎన్నో మలుపులు.. మరెన్నో అనుమానాల మధ్య కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెజారిటీ సీట్లు గెలుపొందిన బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా, తక్కువ స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఎంతో ఉత్కంఠ రేపిన కర్నాటక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో మరో వివాదం రాజుకుంది.

మంత్రి పదవుల పంపకం తర్వాత పార్టీల వారీగా శాఖల కేటాయింపు, మంత్రులకు శాఖల అప్పగింతలోనూ వివాదాలు సాగుతూనే ఉన్నాయి. దీనికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉండగా, వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టేశారనే కారణంతో వారు రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా జరిగేందుకు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది.

సమన్వయ సమితికి చైర్మన్‌గా సీఎం సిద్దరామయ్య వ్యవహరిస్తుండగా సభ్యులుగా సీఎం కుమారస్వామి, డీసీఎం పరమేశ్వర్‌, కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వేణుగోపాల్‌, జేడీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డానిష్‌ అలీలు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం సజావుగా సాగేందుకు సమన్వయ సమితి పనిచేయాల్సి వుంది. ఇందులో భాగంగా ఈ నెల 13న సమన్వయ సమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలు అమావాస్య రోజున ప్రకటించడంతోనే సమస్యలు తలెత్తాయని జేడీఎస్‌ సెంటిమెంట్‌గా భావిస్తుండగా ప్రస్తుతం తొలి సమన్వయ సమితి కూడా అదేరోజున ఏర్పాటు చేయడం మరో వివాదానికి కారణమవుతోంది.

అయితే ఇక్కడ జేడీఎస్ ఓ విషయాన్ని మరిచిపోయిందనే చెప్పాలి. ఫలితాలు అమావాస్య రోజున ప్రకటించినా.. తక్కువ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీయే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. దీనిని గుర్తించని జేడీఎస్ సెంటిమెంట్‌, మూఢనమ్మకాలకు విశ్వాసాన్నిచ్చే అదేరోజు సమన్వయ సమితికి అంగీకరిస్తుందా? లేదా? అనేది చర్చకు కారణమవుతోంది. ఒకవేళ అందుకు అంగీకరించకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఇంకా పెరుగుతుందే కానీ, తగ్గే పరిస్థితి ఉండదు. ఇటువంటి సందర్భంలో జేడీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.