ఇదిగో రిపోర్ట్‌- ఏపీని ద‌గా చేసిన కేంద్రం

తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విభ‌జిస్తూ గ‌త యూపీఏ ప్ర‌భుత్వం హ‌డావిడిగా తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా అప్ప‌టిదాకా అన్న‌పూర్ణ‌గా విల‌సిల్లిన న‌వ్యాంధ్ర‌… వస్తున్న ఆదాయాన్నంతా తెలంగాణకు వ‌దిలేయాల్సి రాగా విధిలేని ప‌రిస్థితుల్లోనే అప్పుల‌తోనే త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించాల్సి వ‌చ్చింది. అయితే విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాలు, ఆ చ‌ట్టంపై రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా నాటి యూపీఏ స‌ర్కారు పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంలో న‌రేంద్ర మోదీ స‌ర్కారు మీన‌మేషాలు లెక్కిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ప‌దేళ్ల పాటు కావాల్సిందేన‌ని నాడు రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత హోదాలో డిమాండ్ చేసిన ప్ర‌స్తుత భార‌త ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు… ఇప్పుడు రాష్ట్రానికి హోదాను ఇవ్వాల్సిందేన‌ని మోదీపై ఒత్తిడి తెచ్చే ఛాన్సే లేకుండా పోయింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తిరుప‌తి వేదిక‌గా అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మోదీ కూడా మాట త‌ప్పారు. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని, అందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పుకున్నా… ప్యాకేజీ అమ‌లుపై మ‌ళ్లీ అనుమానాలు వ్య‌క్తం చేస్తూ… దానినీ అట‌కెక్కించేశారు. ఇచ్చిన నిధుల‌కు ఏపీ ప్ర‌భుత్వం యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం లేదంటూ నిందారోప‌ణ‌లు చేస్తున్న మోదీ స‌ర్కారు.. ఏపీకి నిధుల విడుద‌ల విష‌యంలో త‌న‌దైన మొండి వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తోందనే చెప్ప‌క త‌ప్ప‌దు.
అయితే ఈ విష‌యాల‌పై రాష్ట్రం, కేంద్రం త‌మ త‌మ వాద‌న‌లు వినిపిస్తూ ఉంటే… ఎవ‌రి వాద‌న వారిదిలే అనుకుంటున్న జ‌నం … ఎవ‌రి వాద‌న‌ను న‌మ్మాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇలాంటి కీల‌క త‌రుణంలో ప్ర‌జా పాల‌న‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు, విధి నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్థ‌త‌, కేంద్ర‌, రాష్ట్రాల మ‌ధ్య సంభంధాలు త‌దిత‌ర అంశాల‌తో పాటు అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదాను తెర‌మీద‌కు తెచ్చిన వ్య‌క్తిగా మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ రంగంలోకి దిగేశారు. ఎవ‌రి వాద‌న క‌రెక్ట్ అన్న విష‌యాన్ని చెబుతూనే… అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆయ‌న క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఏపీకి మోదీ స‌ర్కారు న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంద‌ని ఆయ‌న తేల్చేశారు. ఇప్ప‌టికైనా… కేంద్రం క‌ళ్లు తెరిచి ఏపీకి న్యాయం చేయాల‌ని, లేని ప‌క్షంలో రాష్ట్రం మ‌రింత ఆర్థిక సంక్ష‌భంలో కూరుకుపోవ‌డం ఖాయ‌మ‌ని కూడా చెబుతున్నారు.
జేపీ వాదిస్తున్న దాని ప్ర‌కారం రాష్ట్ర రెవెన్యూ లోటు ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లుగా రూ.19,015.48 కోట్లు. దీనిపై కేంద్రం త‌న‌దైన రీతిలో కొర్రీలు వేస్తున్నా… ఒక వేళ కేంద్రం అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా ఏపీ ఆర్థిక లోటు రూ.10,355.07 కోట్లుగా నిపుణులు నిర్ధారించారు. అయితే కేంద్రం చెబుతున్న‌ది మాత్రం రూ.4,117.89 కోట్లు. ఇప్ప‌టిదాకా ఇచ్చింది రూ.3,979.50 కోట్లు. అంటే తాను చెబుతున్న తొండి వాద‌న‌కు స‌రిప‌డ మొత్తాన్ని కూడా కేంద్రం ఇప్ప‌టిదాకా విడుద‌ల చేయ‌లేద‌న్న మాట‌. ఇక ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుపైనా కేంద్రం వాద‌న స‌రికాద‌ని జేపీ అభిప్రాయ‌పడ్డారు. ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.8,711కోట్లు, రెండో దశకి రూ.27,494కోట్లు చొప్పున నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తీరాల్సిందేన‌ని చెప్పిన ఆయ‌న…  ప్రాజెక్టు సవరించిన అంచనాని తక్షణం ఆమోదించాలిల‌ని కూడా సూచించారు.  నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక నిధుల విడుద‌ల విష‌యంలో కేంద్రం చేస్తున్న వాద‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జేపీ…  రాష్ట్రమే ముందుగా ఖర్చు చేస్తే… తీరిగ్గా కేంద్రం నిధులు మంజూరు చేస్తామనటం సరికాదన్నారు. ప్రతి త్రైమాసికానికి ప్రాజెక్టు అంచనా వ్యయంలో 90 శాతాన్ని కేంద్రం ముందుగా చెల్లించాలని, యూసీలను తదుపరి త్రైమాసిక నిధుల విడుదలకు ముందే రాష్ట్రం సమర్పించాలని సూచించారు.
బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ తరహాలో అయిదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.24,350 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా.. ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1,050కోట్లేన‌ని జేపీ చెప్పారు.  వెనకబడిన ప్రాంత తలసరి ఆదాయం, అభివృద్ధి చెందిన ప్రాంత తలసరి ఆదాయంతో సమానం కావాలంటే… ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రావాల‌ని, ఈ దిశగా కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. పరిశ్రమల నుంచి పన్ను వసూలు, అప్పుగా పరిగణిస్తూ వాయిదా వేసిన పన్నుల వసూలు, ప్రోత్సాహకాల తిరిగి చెల్లింపు బాధ్యత తదితరాల్లో నికరంగా ఏపీకి రావాల్సిన మొత్తం రూ.6,841కోట్లుగా నిర్ధారించిన నిపుణుల క‌మిటీ.. చట్టంలో ఒక్కో దానికి ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవటంతో వాటిల్లిన నష్టం రూ.3,820.36కోట్లుగా లెక్క‌క‌ట్టింది.  ఇప్పుడు చట్ట సవరణ సాధ్యం కాదు కనుక ఈ మొత్తాన్నే కేంద్రమే రాష్ట్రానికివ్వాల‌ని జేపీ వాదిస్తున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా అవే ప్రయోజనాలతో కూడిన ప్రత్యేక సాయాన్ని విదేశీ ఆర్థిక సాయంతో అమలయ్యే ప్రాజెక్టులకు(ఈఏపీ) తిరిగి చేసే చెల్లింపుల రూపంలో ఇస్తామని కేంద్రం వెల్లడించిందన్న జేపీ… ఇలా గత మూడేళ్లకి కేవలం రూ.45 కోట్లు మాత్ర‌మే చెల్లించిందని, ఇది ఎందుకూ కొరకాదని తేల్చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చిన తరహాలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం 90శాతం వాటా భరిస్తే ఏపీకి 2015-16 నుంచి 2018-19 వరకూ రూ.15,885.77కోట్లు లభిస్తాయని ఆయ‌న లెక్క‌లేశారు.  ప్రత్యేక సాయంగా అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేకుంటే రాష్ట్రం చెల్లించాల్సిన ఈఏపీ రుణాలు, ప్రత్యేకాభివృద్ధి రుణాలు, కేంద్రం, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తీర్చాల్సిన రుణాలకు సర్దుబాటు చేయొచ్చ‌నే వెసులుబాటు ఉన్న విష‌యాన్ని కూడా జేపీ గుర్తు చేశారు.  నాబార్డు, హడ్కో తదితర అంతర్గత సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అనుమతివ్వాలని,  ఇది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా చూడాలని కూడా జేపీ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనకు ముందే కేంద్రం దుగరాజపట్నంలో ఓడరేవుని రాష్ట్రానికి మంజూరు చేసిందని, ఇక్కడ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదంటే… ప్రత్యామ్నాయ స్థలంలో కేంద్రమే పూర్తి ఖర్చు భర్తిస్తూ తక్షణం నౌకాశ్రయం నిర్మించాలని జేపీ డిమాండ్ చేశారు. నౌకాశ్రయం ఏర్పాటుకు రూ.7,988కోట్ల పెట్టుబడి అవసరమ‌ని, ఆచరణలో అనుబంధ పరిశ్రమల రూపంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పిన జేపీ.. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి దీని ఏర్పాటు తక్షణావసరమ‌ని వాదించారు. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్రం స్థలం కేటాయించి, ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులివ్వగా… భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.12,746.38కోట్లు వెచ్చించాల్సి ఉందని జేపీ చెప్పారు. ఇప్పటిదాకా కేవలం రూ.845.52 కోట్లు (6.63శాతం) మాత్రమే విడుదల చేసిందని, ఇవన్నీ జాతీయ విద్యాసంస్థలేన‌ని,  వాటిని నిర్వహించేదీ కేంద్రమేన‌ని, రాష్ట్రానికి వచ్చేదేమీ లేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన జేపీ…వీటన్నిటికి త్వరితగతిన నిధులిచ్చి పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేన‌ని చుర‌క‌లంటించారు. రాజధాని అమరావతిని జాతీయ రహదారులు, రైలు మార్గాలతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెంచాల్సిన బాధ్య‌త కేంద్రానినదేని చెప్పిన జేపీ…  హైదరాబాద్‌-విజయవాడ-అమరావతి రహదారిని 6 వరసలకి విస్తరించటం, హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌-పిడుగురాళ్ల-గుంటూరు-అమరావతి మధ్య రహదారిని 4 వరసలతో అభివృద్ధి చేయటం, అమరావతి-విజయవాడ-తిరువూరు-జగదల్‌పూర్‌ రహదారిని విస్తరించటం, అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం, అమరావతి ఔటర్‌ రింగ్‌ రోలను తక్షణం చేపట్టి నిర్ణీత కాలావధిలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి రూ.11,261కోట్లు, సామాజిక, మౌలిక వసతులకి రూ.7,330కోట్లు, ట్రంక్‌/టైర్‌-1 వసతులకు రూ.70,682కోట్లు, రైతులకు తిరిగి ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధికి రూ.19,750కోట్లు చొప్పున మొత్తం రూ.1,09,023కోట్లు అవసరమని రాష్ట్రం లెక్కించిన విష‌యాన్ని జేపీ గుర్తు చేశారు. అయితే ఇందులో కేంద్రం మంజూరు చేసింది కేవలం రూ.1,500కోట్లు మాత్ర‌మేన‌ని, దీనిపై రాష్ట్రం రూ.1,632.48 కోట్లకి యూసీలు అందజేసిందని వెల్ల‌డించారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రం రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా నిధుల విడుదలకి ఒక నిపుణుల కమిటీని నియమించాలన్న జేపీ… అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను నీతి అయోగ్‌, కేంద్రానికి అందించిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. కేంద్రం ఇస్తామన్న రూ.1,000 కోట్లలో భాగంగా వెంటనే రూ.666 కోట్లు విడుదల చేయాలని నీతి అయోగ్‌ సిఫారసు చేసిందని, మిగిలిన రూ.334 కోట్లు  2019-20లో ఇవ్వాలని సూచించిందని ఆయ‌న తెలిపారు. ఈ నిధులకు మోక్షం కల్పించాల‌ని,  రాజధాని కోసం 2,087.09 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించడంతోపాటు.. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం నిర్మాణానికి రూ. 219.16 కోట్లు విడుదల చేయాలని జేపీ కోరారు. మొత్తంగా ఈ విష‌యాల‌పై కేంద్రం వినిపిస్తున్న వాద‌న‌ను తొండి వాద‌న‌గా తేల్చిపారేసిన జేపీ… ఏపీకి జ‌ర‌గాల్సిన అన్యాయంపై త‌న‌దైన శైలిలో గ‌ళం విప్పారు.

1 Comment

  1. నిపుణుల కమిటీ వెల్లడించిన నివేదికను బట్టి మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత దగా చేసిందో ఈ దేశ ప్రజలందరికి తెలియాలి.విభజన సమయంలో కాంగ్రెస్ తెలంగాణకు మోదం, ఆంధ్రకు ఖేదం మిగిల్చి అన్యాయoగా విభజిస్తే ఆనాడు పార్లమెంటులో ఆంధ్రకు అదివ్వాలి, ఇది ఇవ్వాలి అని అని బిల్డప్ ఇచ్చి విభజన బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ను మించి ప్రతివిషయంలో తీరని ద్రోహం చేసింది.ప్రత్యేక హోదా ఇవ్వక,కనీసం విభజన చట్టంలో పెట్టిన హామీలు నెరవేర్చక,రాష్టానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వక ఒక పీడలా మోడీ ప్రభుత్వం సతాయిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఆంధ్రుడి గుండె రగిలిపోతుంది. పైగా కష్ట సమయంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న చంద్రబాబుపై ప్రధాని హోదాలో వుండి చెత్తగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. అపద్దాలను అలవోకగా వల్లెవేసే ఇలాంటి ప్రధానిని ప్రజలెప్పుడు చూడలేదు.మోడీ ఇంత దుర్మార్గంగా మన రాష్ట్ర విషయంలో వ్యవవహరిస్తున్నా అతనికి తొత్తులుగా మారి,అతనికి ప్రత్యక్షoగా,పరోక్షంగా కొమ్ము కాస్తున్న రాష్ట్ర నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి.మోడీతో అంటకాగే ఈ రాష్ట్ర నాయకులు తమను పుట్టించిన మాతృభూమికి, తమను పెంచి పోషిస్తున్న నేలకు ద్రోహం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.