జనసేన గెలిచే అవకాశమున్న స్థానాలు ఇవేనట

ఆంధ్రప్రదేశ్‌లో స్పీడు పెంచుతోంది జనసేన పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాడు. ఒకవైపు ప్రజలను కలుసుకునేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్న జనసేనాని.. మరోవైపు పార్టీని పటిష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగనుండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అంతేకాదు, టికెట్ కోసం తమ పార్టీలోకి వచ్చే వారితో కూడా హామీరహిత చేరికలైతే ఓకే అంటున్నాడు. అందువల్ల జనసేనలోని పవన్ అభిమానులు తమ అభ్యర్ధిత్వంపై గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతుండడంతో ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. అయితే, జనసేన నిలబెట్టే అభ్యర్ధులను బట్టే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉందని, అదే జరగాలని కృతనిశ్చయంతో ఉన్న ఆ పార్టీ.. ప్రభావం చూపగల స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం.. రాష్ట్రంలో చేసిన సభ్యత్వ నమోదు, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా కొన్ని కీలక నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా జనసేన పార్టీ ఐదు జిల్లాల్లో కొన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలిసిందట. అందుకోసం ఆయా స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని కోల్పోకూడదని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. జనసేనలోని కొందరు నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, విజయనగరంలో జిల్లాలోని సాలూరు, విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, రాజమహేంద్రవరం సిటీ, పిఠాపురం, తుని, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, పార్లమెంట్ స్థానాల విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. అంతేకాదు, ఈ స్థానాలలో ఏ అభ్యర్ధిని నిలబెట్టినా విజయం సాధిస్తామన్న ధీమాలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మిగతా స్థానాల్లో మాత్రం బలమైన అభ్యర్ధులను నిలబెడితే, అక్కడ కూడా విజయం సాధించవచ్చని జనసేన అధినేత ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.