పవన్‌కు వాగ్ధాటిగల నేతలు కావలెను?

పార్టీ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవలి కాలంలో పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఇదే క్రమంలో మంచి వాగ్ధాటి ఉన్న నేతల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమాల్లో అనుభవమున్న నేతలకు ప్రాధాన్యమిస్తూ వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఏదో తూతూమంత్రంలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారనే టాక్ వినిపిస్తోంది. బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ, వైసీపీలకు ధీటుగా ఓటుబ్యాంకు క్రమంగా పెంచుకోవాలని జనసేన నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు భోగట్టా. దీనికితోడు మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారు సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాల్లో పట్టు సాధించేలా మహిళా కార్యకర్తలకు  జనసేన నేతలు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’కు వివిధ పార్టీలకు చెందిన సామాజికవర్గ నేతలు మద్దతు పలుకుతున్నారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో వైసిపి ముమ్ముడివరం నియోజక వర్గ కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ తన అనుచరులతో కలిసి పవన్‌ కళ్యాణ్ తో సమావేశమవడాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ హామీతో పితాని బాలకృష్ణ పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా జన సేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారని తెలుస్తోంది. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని ఈ సందర్భంగా ఆయన పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని భోగట్టా. దీనిపై స్పందించిన పవన్ వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు జనసేన ప్రాధాన్యాన్ని ఇస్తుందని హామీ ఇచ్చారట. శెట్టిబలిజలతోపాటు వెనుకబడిన కులాలకు తాను అండగా ఉంటాననికూడా పవన్ వారితో చెప్పారట వీటన్నింటినీ చూస్తుంటే పవన్ జనసేన బలోపేతానికి పక్కా ప్లాన్ తోనే ముందుకు కదులుతున్నట్లు తెలుస్తున్నదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కు యువత నుంచి ఫాలోయింగ్ ఉండటంతో దానిని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు జనసేన పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్నదని భోగట్టా. అయితే ఇలాంటి వ్యూహాలను అమలు చేసేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నేతలు అవసరమని పవన్ భావిస్తున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.