20 మంది ఎమ్మెల్యేల చేరిక.. పొలిటికల్ స్టంటేనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చిన ఆ పార్టీ ఆ సారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అందుకోసం ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీ.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోతున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ముందుకు దూసుకుపోతోంది. గతంతో పోల్చుకుంటే ఆ పార్టీ ఇప్పుడు బాగా బలపడుతోంది. వైసీపీ మైనస్‌లు కూడా ఆ పార్టీకి కలిసొస్తున్నాయి. పవన్ పర్యటనలకు భారీగా స్పందన వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి ఇటీవల ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే వారంతా పవన్‌ కల్యాణ్‌తో చర్చించారు. ఆయన నిర్ణయం తీసుకున్నాక తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. అలాగే పార్టీలో కొత్త తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని.. పాత, కొత్త తరం కలయికలతో పార్టీ సమర్థంగా నడుస్తుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజవర్గానికీ మేనిఫెస్టో తయారు చేస్తామన్నారు. ఈ పరిణామం తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? వారు ఏఏ పార్టీలకు చెందిన వారు..? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జనసేనలో చేరేందుకు ఏ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా లేడని, ఇది జనసేన ప్లే చేసిన పొలిటికల్ స్టంట్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం పవన్‌కు ఓ సీనియర్ నేత ఇచ్చిన సలహా మేరకే ఆ పార్టీ నేతలు ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.