పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన కార్యకర్తలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. వారి అండతోనే 2014లో జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తర్వాతే ఎన్నికలు వచ్చినా పోటీ చేయని పవన్.. టీడీపీ-బీజేపీకి మద్దతు తెలిపాడు. ఆ రెండు పార్టీల కోసం ప్రచారం కూడా చేశాడు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయ సమీకరణలు బాగా మారిపోవడంతో.. ఏపీ ప్రభుత్వానికి ఎదురుతిరిగాడు. జనసేన నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో తన మనసులోని బాధనంతా వెల్లగక్కాడు పవన్. ఆ సభలో ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించాడు.

చెప్పినట్లుగానే ప్రజాపోరాట యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభించాడు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్.. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా పవన్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం ఆయన ఇతర పార్టీల నేతలు, విశ్లేషకులు, మాజీ ప్రభుత్వాధికారులను తన పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పలువురు నేతలతో పవనే స్వయంగా మాట్లాడాడు. మంగళవారం అయితే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి మరీ జనసేనలోకి ఆహ్వానించాడు. గతంలో వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకినన్న పవన్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 60 శాతం టిక్కెట్లు కొత్త‌వారికి ఇస్తామ‌ని చెప్పారు. కానీ, పవన్ మాత్రం సీనియర్లు, ఇతర పార్టీ నేతలనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు.

వాస్తవానికి పవన్ మొదట్లో పార్టీలోకి ఇతర పార్టీ నాయకులు వస్తానన్నా లైట్ తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు ఆయనే వెళ్లి మరీ పార్టీలోకి రమ్మని అడుగుతున్నాడు. దీంతో కొందరు ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. మరి మొదటి నుంచీ యువకులను ప్రొత్సహిస్తానంటున్న పవన్ వీళ్లను ఆహ్వానించడంపై పార్టీలోని కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్న తమకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటున్న వారు.. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీలోని కీలక నేతలను కోరుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఆ నేతలు ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్తారా..? ఒకవేళ తీసుకెళ్తే పవన్ ఏం చేస్తాడు..? అనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.