టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు జానా సంచలన నిర్ణయం

టీఆర్ఎస్ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి అంతే ధీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నాయి అక్కడి ప్రతిపక్ష పార్టీలు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచేసింది. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడంలో విఫలమైన అక్కడి నేతలు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ సారి గత ఫలితాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసమే టీకాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సహా మరో రెండు పార్టీలను కలుపుకుని పోవాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆయా పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే దీని తాలూకు చర్చలు పూర్తి అయ్యాయని, సీట్ల సర్ధుబాటు కూడా అయిపోయిన వెంటనే దీని గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో వెంటనే టీఆర్ఎస్ కూడా ఆయనకు కౌంటర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగార్జున సాగర్ తాజా మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాన్ని మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థానాన్ని వదులుకుని మిర్యాలగూడ నుంచి బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఏడు సార్లు గెలిచిన సాగర్‌ స్థానాన్ని జానారెడ్డి తన కుమారుడు రఘువీర్‌కు ఇప్పించాలని కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన మిర్యాలగూడలో నిలవాలని నిర్ణయించుకున్నారని వినికిడి. సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య అనంతరం అతని భార్య అమృతవర్షిణిని పరామర్శించడానికి జానారెడ్డి మిర్యాలగూడకు వెళ్లడం కూడా అక్కడి నుంచి పోటీ చేసే వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇక్కడి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఆయన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఈ నెల 6న ప్రకటించిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో భాస్కర్‌రావుకూ చోటు కల్పించారు. ఇప్పుడు జానారెడ్డి వార్త బయటకు రావడంతో టీఆర్ఎస్ కూడా అక్కడ అభ్యర్ధిని మార్చాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.