జై సింహా సినిమా సమీక్ష

జై సింహా సినిమా సమీక్ష

చిత్రం: జై సింహా

రేటింగ్‌: 3/5

నటీనటులు: బాలకృష్ణ, నయనతార, నటాషాదోషి, హరిప్రియ, మురళిమోహన్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు

ఛాయాగ్రహణం: సి.రామ్‌.ప్రసాద్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ ఆంటోని

కథ, మాటలు: ఎం.రత్నం

సంగీతం: చిరంతన్‌ భట్‌

కథనం, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌

నిర్మాత: సి.కల్యాణ్‌

పరిచయం: పంచ్‌ డైలాగ్స్‌ చెప్పడంలోనూ, మాస్‌ అలరించడంలో బాలకృష్ణది అందివేసిన చేయి.. అలాంటి హీరో సంక్రాంతి బరిలో నిలిస్తే ఫ్యాన్స్‌ అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అందులోనూ పెద్ద పండుగకు ఓటమెరుగని పుంజుగా పేరున్న బాలయ్య జైసింహాగా రావడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. మరి ఫ్యాన్స్‌ ఆశలు, ఏళ్లగా వస్తున్న సెంటిమెంట్‌ వర్క్‌అవుట్‌ అయ్యిందా.. బాలయ్య బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర సత్తా చాటాడా లేదా తెలుసుకుందామా..

కథ: ఆందోళనలో ఉన్న నరసింహ(బాలకృష్ణ) తన ఏడాది కొడుకుని తీసుకుని కుంభకోణం(తమిళనాడులో ఒక ఊరు)కు చేరుకుంటాడు. అక్కడ ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో పనికి కుదురుతాడు. ఆశ్రయమిచ్చిన కుటుంబం కోసం ధర్మకర్త కూతురు(నటాషా దోషి) చేసిన ఒక కారు ప్రమాదాన్ని తన నెత్తిమీద వేసుకుంటాడు. అలా అక్కడ బాలయ్యకు శత్రువులు మొదలవుతారు. స్థానిక ఏసీపీ సైతం నరసింహ పనిపట్టాలని చూస్తాడు. ఆ క్రమంలోనే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గౌరి(నయనతార) ఏసీపీ భార్య అని తెలుసుకుని నరసింహ ఆశ్చర్యపోతాడు.. వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించే క్రమంలో జరిగే పరిణామాలతో కథ ఎలా మలుపు తిరిగింది, అసలు గౌరితో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, బాలయ్య కొడుకు, గౌరి కొడుకు ఒకేలా ఎందుకు ఉన్నారు అనే అంశాలతో ఆసక్తిగా సాగే కథ వెండితెరపై చూడాల్సిందే..

విశ్లేషణ: బాలయ్య సినిమా అనగానే అదిరిపోయే డైలాగ్స్‌, భారీ ఫైట్లు, చేజింగులు ప్రేక్షకులు కోరుకుంటారు.. వాటిని ఎక్కడ మిస్‌ చేయకుండా ప్రేమకథను అంతర్లీనంగా జోడించి దర్శకుడు రవికుమార్‌ కొత్తకోణంలో కథానాయకుడిని పరిచయం చేశాడు. ప్రధమార్ధంలో కొంత రఫ్‌గా లో చూపించినా, సెకండాఫ్‌లో అదిరిపోయే లుక్‌తో చాలా స్టైలిష్‌గా వెండితెరపై చూపించాడు. ముఖ్యంగా హీరోలో ప్రేముకుడిని ఎలివేట్‌ చేసేలా కథ రాసుకోవడం సినిమాకి కలిసొస్తుంది. సెంటిమెంట్‌ కూడా కావాల్సినంత వాడుకుంటూ కథను ఉరుకులు పెట్టించాడు. ముగ్గురు కథానాయికలను కేవలం గ్లామర్‌ డాల్స్‌లా కాకుండా కథలో భాగంగా దర్శకుడు చూపించాడు. నయనతార నటన ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ భార్యగా మంగ క్యారెక్టర్‌ చాలా కొత్తగా, సహజంగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడీ తేలిపోయింది. ఆశించిన స్థాయిలో వినోదం కనిపించదు. 

సాంకేతిక విలువలు: ఎక్కడా బోర్‌ కొట్టకుండా ప్రవీణ్‌ ఆంటోని తన పనితనం చూపించి సినిమాకి పెద్ద ఎసెట్‌గా నిలిచాడు. అదే సమయంలో ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామాన్‌ సి.రామ్‌.ప్రసాద్‌ చాలా కష్టపడ్డాడు. చాలా కలర్‌ఫుల్‌గా కథనం సాగడంలో ఛాయాగ్రహణం కీలకమని చెప్పొచ్చు. ఎం.రత్నం సంభాషణలు పర్వాలేదనిపించాయి. బాలయ్య అనగానే ఆశించిన స్థాయిలో పంచ్‌ డైలాగ్స్‌ ఒకటి రెండు మినహా ఎక్కువ లేకపోవడం కొంత లోటే అని చెప్పొచ్చు. పాటలు స్ర్కీపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో చిరంతన్‌భట్‌ మార్కులు సంపాదించాడు. సినిమా మరో బలంగా రామ్‌ లక్ష్మణ్‌లు నిలిచారు. ఇన్నాళ్ల నుంచి ఫైట్లు చూస్తూనే ఉన్నా హీరో బలాన్ని ఎలివేట్‌ చేసే సన్నివేశాలను కొత్తగా పరిచయం చేయడంలో వారు విజయం సాధించారు.

ప్లస్‌ పాయింట్లు:

+ బాలకృష్ణ, నయనతార, హరిప్రియ నటన

+ సెంటిమెంట్‌ సన్నివేశాలు

+ మాస్‌ని అలరించే భారీ ఫైట్లు

+ ద్వితీయార్ధం

మైనస్‌ పాయింట్లు:

– పాత కథ, పాటల చిత్రీకరణ

– ప్రధమార్ధం, వినోదం లేకపోవడం

– రొటీన్‌ క్లైమాక్స్‌

ఫలితం:

మాస్‌ని ఆకర్షించడమే లక్ష్యంగా తీసిన జైసింహా దానికి చేరువైందనే చెప్పాలి. దాంతో బీ, సీ సెంటర్లకు ఢోకా లేకుండా సంక్రాతికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏ సెంటర్లలో మాత్రం యావరేజ్‌గా టాక్‌ తెచ్చుకున్నా పండుగ సందర్భంగా పైసావసూల్‌  బొమ్మగా నిలుస్తుంది. మొత్తంగా ఈ సంక్రాతి బరిలో విజేతగా నిలిచాడు.

– ‘మాస్‌ మెచ్చె ప్రేమ సింహం’

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.