పవన్‌ను తిట్టి జగన్ తప్పుచేశాడా?

మొన్నటివరకూ అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్ అంటూ దేశరాజధాని ఢిల్లీ చుట్టూ తిరిగిన ఏపీ రాజ‌కీయాలు మరో మలుపు తీసుకున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబుపై కాస్త విమర్శలు తగ్గించిన జగన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విరుచుకుపడిన విషయం విదితమే!. ఇన్నాళ్లూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును కూడా అంతగా ఎత్తని జ‌గ‌న్ ఏకంగా అతనిపై వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయడం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు జగన్.. పవన్‌ను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు జగన్, పవన్ ఒక వేదికను పంచుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అటు పవన్ కానీ, ఇటు జగన్ కానీ ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆసక్తి కనబరచలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జగన్‌కే పవన్ అవసరం ఎక్కువగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్ తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పవన్ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని పలువురు అంటున్నారు. అయితే సడెన్‌గా జగన్‌… పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఇటువంటి అంచనాలకు తెరపడినట్లయ్యింది.
గత ఎన్నికల్లో పవన్ మద్ధతు కారణంగానే టీడీపీ గెలిచిందనే విషయం విదితమే! పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ తెలుగుదేశానికే పడ్డాయనే విశ్లేషణలు ఉండనేవున్నాయి. వైసీపీ అధినేతకూ ఇది తెలిసివుండవచ్చు. వచ్చే ఎన్నికల్లో  గెలిచి తీరాలని తాపత్రయ పడుతున్నజగన్ కాపు నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నవిషయం విదితమే! . ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయాన్ని చెప్పిన మేరకు జగన్ కాపులకు దగ్గరవుతూ వచ్చారని భోగట్టా. ఇలా కొంతవరకూ సానుకూలంగా సాగుతున్న తరుణంలో జగన్ కోరి పెద్ద తప్పు చేశాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా ఎవరినైనా ఎదుర్కోవాలంటే వ్యక్తిగత దూషణలు పనికిరావన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యానించారు. పైగా జగన్‌ చేసింది ముమ్మాటికీ తప్పేనని ప్రకటించారు. ఏదిఏమైనప్పటికీ ఇన్నాళ్లూ పవన్ విషయంలో జాగ్రత్తగా ఉన్న జగన్ ఇప్పుడు ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.