జగన్ కు పరీక్ష పెడుతున్న నందికొట్కూరు అభ్యర్థులు

ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే యక్కలదేవి ఐజయ్యకు ఈసారి ఆ పార్టీ టికెట్‌ లభించదేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఐజయ్యపై సదభిప్రాయం ఏర్పడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్‌ను ఎలాగోలా దక్కించుకుని 22 వేల భారీ ఆధిక్యతతో గెలుపొందిన ఐజయ్య అధినాయకుని విశ్వాసం చూరగొనడంలోనూ విఫలమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా2014లో వైఎస్సార్‌సీపీ తరపునుంచి గెలుపొందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ ప్రలోభాలకు లొంగి అధికారపార్టీలోకి జంప్ చేసిన విషయం విదితమే. ఆ సమయంలో ఐజయ్యకు కూడా టీడీపీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినిపించాయి. అయితే ఐజయ్యకు వైఎస్సార్‌సీపీ నేతలు పార్టీ వీడవద్దని నచ్చ జెప్పిన నేపధ్యంలో ఆయన తాను గెలిచిన పార్టీలోనే ఉండి పోయారు. తాజాగా నియోజకవర్గంలో ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటంతో జగన్‌ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ. దీనికితోడు ఐజయ్య చాలామందితో దురుసుగా వ్యవహరిస్తున్నారనే విషయం జగన్‌ దృష్టికి వచ్చిందని తెలుస్తోంది. దీనికిగోడు నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కూడా ఐజయ్య వ్వవహారశైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీకి విజయాన్ని అందించడంతో ఒకటిగావున్ననందికొట్కూరులో అభ్యర్థిని మార్చని పక్షంలో అక్కడ గెలుపొందడం కష్టం అనే భావన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోందట.

మరోవైపు ప్రలోభాలు వెంటాడినా తమ వెంటే నడిచిన ఐజయ్యను జగన్ గుర్తుపెట్టుకుంటారనే వార్త కూడా వినిపిస్తోంది. కాగా ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు కాపుగాచుకున్నారని సమాచారం. వీరిలో ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గతంలో అసెంబ్లీలో ప్రధాన భద్రతాధికారిగా పనిచేసిన అర్థర్‌ ఉన్నారని సమాచారం. వీరిద్దరూ ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఐజయ్య టిక్కెట్ ఇవ్వని పక్షంలో తమ పేర్లను పరిశీలించాల్సిందిగా ఇప్పటికే జగన్‌ను కలిసి విన్నవించుకున్నారని అంటున్నారు. అయితే లబ్బి వెంకటస్వామిపై జగన్‌కు అంత సదభిప్రాయం లేదనే టాక్ వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండతో పైకొచ్చిన లబ్బి ఆ తరువాత టీడీపీ వైపు వెళ్ళిపోవడమే కాకుండా 2014లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. ఇది స్థానిక నేతలకు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదని సమాచారం. మరోవైపు అర్థర్‌కు 2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ “బి” ఫారం ఇచ్చి, చివరి క్షణంలో రద్దు చేసింది. ఆ విషయాన్నిఇప్పుడు అర్థర్‌ జగన్‌తో పాటు జిల్లాలోని ముఖ్య నేతలకూ చెబుతున్నారని తెలుస్తోంది. ఆయన గత ఎన్నికల్లో టికెట్‌ చేజారినందున ఇపుడు తనకు టికెట్‌ కావాలని కోరుతున్నారట. మరోవైపు ఎమ్మెల్యే ఐజయ్య కూడా తన టికెట్‌ను నిలబెట్టుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ఇప్పుడున్న పరిస్థితిలో నందికొట్కూరు టిక్కెట్ ఐజయ్యకే దక్కుతుందా? లేక అర్థర్‌, లబ్బి వెంకటస్వామిలలో ఎవరైనా సాధించుకుంటారేమో వేచిచూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.