ధీటైన అభ్యర్థుల వేటలో జగన్?

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత‌ జగన్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం ఎంతో ముఖ్యంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రానిప‌క్షంలో పార్టీ ఇంకా ఇబ్బందుల పాలవుతున్నందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే జ‌గ‌న్ ఎన్నో కుట్ర‌లు, కుంత్రాలు ప‌న్నుతూ తెర‌వెన‌క బీజేపీ, జ‌న‌సేన‌ల‌తో కుటిల రాజ‌కీయ కుట్ర‌ల‌కు తెర‌లేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కొన్ని జిల్లాల్లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న వారిని ఓడించేందుకు ఎన్నో ఎత్తులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జ‌గ‌న్ ప్లాన్లు, వ్యూహాలు ఎలా ఉన్నా టీడీపీలో తిరుగులేని లీడ‌ర్లుగా ఉన్న వారి విష‌యంలో మాత్రం ఆయ‌న ఎత్తులు ఏ మాత్రం పారేలా లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జ‌గ‌న్ టార్గెట్ చేసే టీడీపీ లీడ‌ర్ల‌లో రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులో గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, కృష్ణాలో మైల‌వ‌రం ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇలా చాలామంది ఉన్నారట. ఆయా ప్రాంతాల్లో జగన్ వారికి ధీటైన అభ్యర్థులను ఎంపికచేసే పనిలో పడ్డారని సమాచారం. ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందని తేలింది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి పోటీ గట్టిగానే ఇస్తుంది.
ఈ 135 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలున్నట్లు కూడా పీకే టీం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను కూడా జగన్ కు అందించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో ఇతర పార్టీల నేతలు కూడా కొందరు ఉండటంతో వారిని పార్టీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డితో ఒక టీంను ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలను ఫ్యాన్ పార్టీవైపునకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సామాజక సమీకరణాలతో పాటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి ఈ నలభై నియోజకవర్గాల్లో దించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నలభై నియోజకవర్గాల్లో దాదాపు పది రిజర్వ్ డ్ స్థానాలు ఉండటంతో వాటి బాధ్యతను పార్లమెంటు సభ్యులకు అప్పగించాలని నిర్ణయించారట. రిజర్వ్ డ్ స్థానాల్లో ఈసారి పార్టీకి నమ్మకంగా ఉండే వారిని ఎంపిక చేయాలని జగన్ ప్రత్యేకంగా సూచించారని సమాచారం. గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన వారిలో ఎక్కువ మంది రిజర్వ్ డ్ స్థానాలకు చెందిన వారు కూడా ఉండటంతో ఈసారి ఆచితూచి ఎంపిక చేయాలని జగన్ నేతలకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.