పవన్ బ్రేక్ ఇవ్వడానికి జగనే కారణం

ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ అభివృద్ధే మంత్రంగా ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీలు ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక పక్క వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండగా, మరో పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్ర పేరిట మరో యాత్రను ప్రారంభించాడు. జగన్ పాదయాత్ర అంతిమ దశకు చేరుకోగా, పవన్ యాత్ర మూడు జిల్లాల్లో పూర్తయింది.

జగన్ పాదయాత్రకు మిశ్రమ స్పందన వస్తోంది. వైసీపీ పట్టున్న జిల్లాల్లో యాత్రకు భారీ స్పందన వస్తుండగా, ఆ పార్టీ ప్రభావం లేని జిల్లాల్లో జన సమీకరణ చేయలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పది జిల్లాల్లో పూర్తయిన జగన్ పాదయాత్ర.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. గత నెల 12 నుంచి జగన్‌ తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రను ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో మాదిరిగా ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర సాగడంలేదు. వరుణుడు పదే పదే అడ్డుపడుతుండడంతో ఆయన శిబిరం వద్దే ఉంటున్నాడు. ఇక, జనసేన అధినేత పవన్ విషయానికొస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్రను ముగించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాడు.

వాస్తవానికి పవన్ యాత్రకు బ్రేక్ పడడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో గోదావరి జిల్లాలో పర్యటించాలని భావించిన పవన్.. ముందుగా తూర్పు గోదావరిలో పర్యటించాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట. దీనికి పోలీసుల అనుమతి అవసరం కావడంతో.. జనసేన నాయకులు ఏపీ పోలీసుల అనుమతి కోరగా, దీనికి వారు నిరాకరించారని సమాచారం. ప్రస్తుతం ఈ జిల్లాలోనే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నందువల్ల ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని, ఈ కారణంగానే యాత్రకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పేశారట. పోలీసులు చెప్పిన దానికి సంతృప్తి చెందిన పవన్.. కొద్దిరోజులు తన యాత్రకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని తెలిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.