రంగంలోకి దిగిన జగన్.. చంద్రబాబే ప్రతివాది

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటి వరకు సాధారణ రాజకీయాలకే పరిమితమైన పార్టీలు ఇప్పుడు వేగం పెంచేశాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేయాలనుకుంటున్నాయి. అయితే, కొద్దిరోజుల కింద వరకు సాదాసీదాగా జరిగిన రాజకీయాలు జగన్‌పై దాడి తర్వాత ఉధృతం అయ్యాయి. విశాఖపట్నంలోని ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్‌పై కోడి పందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. జగన్ తన అభిమాన నేత అని, ఈ దాడి వల్ల ఆయనపై సానుభూతి వచ్చి సీఎం అవుతాడనే ఉద్దేశంతోనే హత్యాయత్నం చేసినట్లు నిందితుడు చెబుతున్నాడు. సంఘటనా స్థలంలోనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రతిపక్ష నేత కావడంతో ఈ కేసును అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో జగన్‌పై దాడి ఘటనలో రోజుకో సంచలన విషయం బయటికొస్తోంది.

ఈ దాడి జరిగిన తర్వాత మీడియా ముందుకు రాకుండా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నాడు వైసీపీ అధినేత. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు కూడా ఇదే తరహాలో ఓ పిల్ దాఖలైంది. తాజాగా జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదిగా చంద్రబాబు పేరును జగన్ చేర్చారు. జగన్ పిటిషన్ వేయడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే నిందితుడు తాను వైసీపీ అధినేత అభిమానిని స్వయంగా చెప్పినా.. దీని వెనుక ఎవరో ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేయిస్తుండగా.. జగన్ పిటిషన్ వేయడం ద్వారా సానుభూతి రాజకీయాలకు తెరలేపారని విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల వైసీపీ అధినేతకే ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.