అసహనంతో నోరుజారుతున్న జగన్ పార్టీ నేతలు

ఏపీలో వైసిపి నేతలు తరచూ అధికారులపై నోరుపారేసుకోవడంతో విమర్శల పాలవుతున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా వీరు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులను టార్గెట్‌ చేసుకుని వారు మాటల దాడులకు దిగుతున్న వైనం పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఒత్తిడితో, సహనం కోల్పోయి వారికి నచ్చినట్టు వ్యవహరించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వైసిపికి చెందిన ముగ్గురు కీలక నేతలు వ్యవహరించిన తీరు సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తానని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు, దీన్ని మరువక ముందే నగరి ఎమ్మెల్యే రోజా పోలీసులపై తిట్ల వర్షం కురిపించారు. తాజాగా వైసిపి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ అధికారులను ఊరకుక్కలతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ విధంగా వైసిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము అలా వ్యవరించాల్సి వస్తోందని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని వారు వివరణ ఇస్తున్నారు. తమపై రాజకీయాలు రుద్దడమే కాకుండా తీవ్ర పదజాలాన్ని వాడుతూ దూషించడం సరికాదంటున్నారు. ఇకనైనా జగన్ పార్టీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కాగా వైసిపి నేతలు ఇలా అధికారులను టార్గెట్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే వైసిపి అధినేత జగన్ రిజర్వేషన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే ఆ పార్టీ  నేతలు కూడా ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జగన్ చేపడుతున్న పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు ఇలా వ్యవహరించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ముంచుకొస్తున్న ఎన్నికల నేపధ్యంలోనే వారు గెలుస్తామో? లేదోనన్న సందేహంతో ఒత్తిడికి గురై ఇలా ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనప్పటి ఇటువంటి తీరును వైసిపి నేతలు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.