జగన్ కాన్ఫిడెంట్‌గా లేడట

2019లో అధికారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నాడు వైసీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి. అందుకోసం ఎప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నాడు. అందుకోసం ప్రశాంత్ కిశోర్ వంటి వ్యూహకర్తను బరిలోకి దింపాడు. ఆయనతో చర్చించి.. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మొదట్లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఓ దశలో ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడం కోసం ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు చేసే జగన్.. చాలా సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేది. దీని నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ సాయం కోరాడు.

ఆయన రాష్ట్రంలో తన బృందంతో సర్వే చేయించి, జగన్‌కు నివేదిక ఇచ్చాడు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల సమస్యలను వాళ్ల దగ్గరకు వెళ్లి తెలుసుకుంటే మంచిదని సూచించాడు. దీనిలో భాగంగానే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే గత సంవత్సరం ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. 3000 కిలో మీటర్ల టార్గెట్ పెట్టుకున్నాడు జగన్. ఇప్పటికే అది దాదాపు పూర్తవ్వచ్చింది. జగన్ పాదయాత్ర ఏమోగానీ, స్థానికంగా ఉండే వైసీపీ నేతలకు అది ఇబ్బందిగా అనిపించింది.

పాదయాత్రకు జనాలను సమీకరించి అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో సీటు పట్టేయాలని వారు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. వారు ఊహించినట్లుగానే జనం ఎక్కువగా హాజరైన నియోజకవర్గాల సమన్వయకర్తలను అభినందించడం.. పాదయాత్రకు జన సమీకరణ చేయలేని వారిని నిందించడం చేశాడు జగన్. అంతేకాదు కొన్ని చోట్ల వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధులను కూడా ప్రకటించాడు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తాడని నాయకులంతా భావించారు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. ఎన్నికలకు ఏడాదే సమయం ఉన్నందున జగన్ కూడా పాదయాత్ర సమయంలోనే అభ్యర్థులను ప్రకటించాలని అనుకున్నాడట.

కానీ, కొందరు నాయకుల పట్ల జగన్ కాన్ఫిడెంట్‌గా లేడట. ఇప్పుడు ప్రకటిస్తే టికెట్లు దక్కని వారు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని జగన్ పునరాలోచనలో పడ్డాడట. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు వైసీపీ కసరత్తు చేసేసిందట. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొందని సమాచారం. వైసీపీ సర్వేల ఆధారంగా ప్లాన్ చేసిందట. వచ్చే ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎవరిని పోటీ చేయిస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయమై గతంలో క్షేత్రస్థాయిలో ప్రశాంత్‌కిషోర్ బృందం సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.