కాపుల రిజ‌ర్వేష‌న్‌పై ఇరుక్కుపోయిన జ‌గ‌న్‌!

ఏపీలో ఏ పార్టీ నెగ్గాల‌న్నా కులాల బ‌లం చాలా కీల‌కం. ఏ ఒక్క కులం తూచ్ అన్నా.. ఇక ప్ర‌తిప‌క్ష‌మే. ద‌శాబ్దాలుగా ఇది ప్ర‌తిఫ‌లిస్తూనే ఉంది. ఉమ్మ‌డి ఏపీలో ఒక వేళ కోస్తాలో దెబ్బేసినా.. తెలంగాణ‌లో స‌రిచేసుకునే అవ‌కాశం మిగిలేది. కానీ.. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత పూర్తిగా విజ‌యం సాధించేందుకు అక్క‌డేప‌ట్టు సాధించాల్సి ఉంది. అటువంటి చోట రాజ‌కీయ‌ప‌క్షాలు ప్ర‌తికులం గురించి ఆచితూచి స్పందిస్తాయి. మాట్లాడేట‌పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఈ టెక్నిక్ గ్ర‌హించిన టీడీపీ అధినేత 2014లో కులాల‌కు తాయిలాలు ప్ర‌క‌టించారు. దానిలో భాగంగానే కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్స్ హామీ ఇచ్చేశారు. అది అమ‌లైందా లేదా అనేది వేరే విష‌యం ఎందుకంటే.. అది కేంద్ర ప్ర‌భుత్వంతో స‌యోధ్య‌గా ఉన్న‌పుడే సాధ్య‌మ‌నేది అంద‌రికీ తెలిసిందే. అయినా.. కాపుల ఓట్ల కోసం ఆనాడు చెప్ప‌టం.. త‌రువాత కాపు కార్పొరేష‌న్ ద్వారా ఏదో మ‌మ అనిపించటం అన్ని జ‌రిగాయి. ఆ త‌రువాత కాపు రిజ‌ర్వేష‌న్స్‌పై క‌మిష‌న్ నియ‌మించ‌టం.. నివేదిక‌ను.. మంత్రివ‌ర్గం ఆమోదించి కేంద్రానికి పంప‌టం అయిపోయాయి. చ‌ట్టప్ర‌కారం ఏ రాష్ట్రంలో కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్ మించ‌కూడ‌దు. అయినా  రాజ్యాంగంలో అవకాశాన్ని వినియోగించుకుంటార‌ని కాపులు భావించారు.  కీల‌క‌మైన స‌మ‌యంలో ఎన్‌డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రావ‌టంతో కొత్త ప్ర‌భుత్వంపై రిజ‌ర్వేష‌న్ అంశం ఆధార‌ప‌డి ఉంది. ఇటువంటి స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. చేసిన కామెంట్స్ కాపుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. రిజ‌ర్వేష‌న్ తన ప‌రిధిలోనిది కాద‌ని.. కేంద్రం చూసుకుంటుంద‌ని చేతులెత్తేశారు.
కావాలంటే.. ఒక‌వేళ గెలిపిస్తే కాపు కార్పొరేష‌న్ నిధులు రెట్టింపు చేస్తానంటూ చెప్పాడు. వాస్త‌వానికి ఇదే వాద‌న జ‌గ‌న్ మొద‌టి నుంచి చెప్పివుంటే ఆయ‌న‌మాట‌కు విలువ ద‌క్కేది. కానీ.. 2016లో కాపులు రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసేందుకు తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌న్నాడు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెడితే బీసీల‌కు ఇబ్బందిలేకుండా కాపులూ రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అనుభ‌వించ‌వ‌చ్చ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. మ‌రి ఇప్పుడెందుకు కాపుల‌పై విషం గ‌క్కుతున్నార‌నేది మాత్రం ఆయ‌నకే తెలియాలి. మ‌డ‌మ‌తిప్ప‌ని నేత‌గా.. జ‌బ్బ‌లు చ‌ర‌చుకుంటున్న జ‌గ‌న్ కాపుల విష‌యంలో ద్రోహం చేశార‌నేది స్వ‌యంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో.. పాపం జ‌గ‌న్‌కు కాపులు ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.