ఇరుకున పడిన జగన్… ఇరకాటం నుంచి తప్పుకునేనా?

కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనంటూ జగన్ తేల్చిచెప్పేసిన నేపధ్యంలో మరోమారు రాజకీయ సమీకరణలను మారిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు జగన్ కు మరో సమస్య వచ్చి పడింది. ఆయన పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లోని పలు చోట్ల కాపు యువకులు, మహిళలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న జగన్ తప్పును సరిద్దుకునే పనిలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం వైఎస్ జగన్ పార్టీలో కొంత మంది కాపు నేతల్ని రంగంలోకి దింపడంతో వారంతా హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టేశారు. జగన్ మాటల్ని వక్రీకరించారని ప్రత్యారోపణలకు దిగారు. రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్‌ 9లో సీఎం పెట్టించలేకపోయారని దానిని మాత్రమే జగన్ వివరించారని ఆ నేతలు వివరణ ఇచ్చారు. పైగా జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపులంతా అర్థం చేసుకున్నారని, ఎవరెన్ని రాజకీయాలు చేసినా ప్రయోజనం ఉండదని ఢంకా బజాయించారు. దీనిని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెనుకడుగు వేసినట్లేనన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. పార్టీ విధానం అదే అయినప్పుడు, కొత్తగా కాపు నేతలందర్నీ రంగంలోకి ఎందుకు దించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిని వక్రీకరణ అని చెప్పించడమెందుకని పలు పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. రాజకీయంగా సాధించాల్సిన దానిని కూడా జగన్ చేయలేనని చెప్పేయడం వెనుక కారణాలేమిటన్న దానిపై కాపు వర్గంలో చర్చ జరుగుతోంది.
పైగా జగన్ దీనిని కేంద్ర పరిధిలోని అంశమని తప్పించుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పరిధిలోని ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్ దీనిపై ఎందుకు పోరాడరని పలువురు నిలదీస్తున్నారు. మరోవైపు జగన్ ప్రకటన ఆధారంగా ఆ పార్టీని మరింతగా ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ సిద్ధం అవుతోందన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిందే! కేంద్ర పరిధిలోని అంశాలపై తానేమీ చేయలేనని జగన్ చెప్పడంతో ఆయన ఓటు బ్యాంకుకు గండిపడవచ్చని రాజకీయ నిపుణులు జోస్యం చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.