గ్రామ‌ద‌ర్శినికి పోటీగా పల్లెబాట‌.. జ‌గ‌న్ వంద‌రోజుల వ్యూహం

వ‌చ్చే సాధారణ ఎన్నికల్లో విజయసాధ‌నే లక్ష్యంగా టీడీపీ  చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమానికి పోటీగా  జ‌గ‌న్ పార్టీ కూడా గ్రామాల్లో ప్రచారానికి ముహూర్తం నిర్ణ‌యించింది. ప‌ల్లెబాట పేరుతో పార్టీ ఆధ్వర్యంలో వైకాపా నేతలు పల్లెలు, పట్టణాల్లో వార్డుల్లో విరివిగా ప‌ర్య‌టించ‌నున్నారు. గత నాలుగేళ్ల‌లో  టీడీపీ  చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి వైఫల్యాలపై  ప్రజలకు వివరించేందుకు జ‌గ‌న్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.  ఇందుకోసం పార్టీ అధినేత జగన్ అన్ని జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించ‌నున్నార‌ని తెలుస్తోంది. దీనిలో వైకాపా చేపట్టబోయే వంద రోజుల కార్యక్రమ విధివిధాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.  ఇదిలాఉండ‌గా గత నాలుగేళ్లలో టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు, కేంద్రం మోసం చేసిన తీరు వంటి అంశాలతో తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్న‌ సంగతి తెలిసిందే! అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లిన సమయంలో వారందించే  ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి  కృషి చేయునున్న‌ట్లు తెలిపింది. 
ఇందుకోసం గ్రామవికాసం పేరుతో అధికారులను సైతం గ్రామాలకు ఆ పార్టీ  పంపిస్తోంది. దీనికితోడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వ‌ర‌గా పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం  ఉత్తర్వులు కూడా జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.   ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయం జ‌గ‌న్ పార్టీలో  ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో జగన్  త‌న పార్టీ ముఖ్య నేత‌ల‌తో చర్చించి, తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ కార్యక్రమాలు చేపట్టాల‌ని ఆదేశాలు జారీ చేసినట్లు స‌మాచారం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేసుకుని, ఆగస్టు 2 నుంచి ఏకధాటిగా వంద రోజుల పాటు పార్టీ నేత‌లంగా ప్రజల్లోనే ఉండాలని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏతావాతా ఈ రెండు పార్టీల  కార్య‌క్ర‌మాల‌తో శివారు గ్రామాల్లోనూ రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌ళ‌క‌ళ‌లాడ‌నుంద‌నే వ్యంగ్యోక్తులు వినిపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.