జ్యోతులకు హెచ్చరిక

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు సిఎం చంద్రబాబునాయుడు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే నేతలు ఎవరైనా.. ఏ పార్టీయైనా ఊరుకోవద్దని చెప్పారు. ఆచరణలో అదే చూపిస్తున్నారు అధికారులు. ఫలితంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లారు జ్యోతుల నెహ్రు. ఫలితంగా తనకు ఎదురు లేదనుకున్నారు. టీడీపీలో ఉన్నా.. ఈ మధ్య కాలంలో ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తిరిగి పార్టీ మారతారనే చర్చ సాగుతోంది. ఆ విషయం పై రగడ రేగుతుండగానే… కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చారు జ్యోతుల వారసుడు నవీన్‌. 
ఆస్తులు తక్కువ చూపించారు…
గతంలో తమ ఉమ్మడి ఆస్తి అయిన గోదాముల విక్రయానికి సంబంధించిన ఫారాల్లో తక్కువ లెక్కలు చూపించారు. ఫలితంగా అది ఆదాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. అంతే తక్కువగా చూపించిన ఆస్తి, సేల్‌ డీడ్ రిజిస్ట్రేషన్‌పై అధికారులు వివరణ అడిగారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా… ఐటీ రిటన్స్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పద్దతి ప్రకారం అంతా చెల్లిస్తే సరే. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్యోతుల నెహ్రు స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు సోదాలు చేయడంతో అనేక పత్రాలు బయట పడ్డాయి. మరికొంత మేర ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. 
వైరమే దాడులకు కారణమా…
ఎంపీ తోట నరసింహం-జ్యోతుల నెహ్రుల మధ్య వైరం నెలకుంది. ఇద్దరు మరో పార్టీ నుంచి వచ్చిన వారే. కాబట్టి ఆధిపత్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఫలితంగా క్యాడర్ అయోమయంలో పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు టీడీపీ నేతల నుంచి ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారముంది. టీడీపీలోకి వచ్చిన దగ్గరి నుంచి తోట నరసింహం అనుచరులను జ్యోతుల వర్గం అణగదొక్కుతుందనే వాదనుంది. ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తున్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ప్రచారం లేకపోలేదు. మంజూరైన అభివృద్ధి పథకాలు అమలు కాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర సంక్షేమ పథకాలు ఎంపీ అనుచరులకు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న వివక్షను భరించలేక బూరుగుపూడి సర్పంచి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. 
ఆధిపత్యం కోసం…
ఇంకోవైపు జగ్గంపేటకు చెందిన టీ,డీపీ నాయకుడు బండారు రాజాకు ఏ పని కానీయకుండా అడ్డు పడుతున్నారంటున్నారు. మరో టీడీపీ నేత తోట అయ్యన్న పరిస్థితి ఇలానే ఉంది. ఎంపీ అనుచరునిగా ఉన్న అతనికి పార్టీలో ప్రయార్టీ లేకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల నాటికి తమ వర్గమే ఉండాలని.. మరొకరికి అవకాశం ఉండకూడదనే రీతిలో జ్యోతుల పావులు కదపడం ఇబ్బందిగా మారింది. అందుకే అంతాకలిసి సిఎం చంద్రబాబునాయుడుతో పాటు.. మిగతా నేతలకు ఫిర్యాదు చేశారు. చివరకు ఐటీ అధికారులకు వారే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీలు ఆధిపత్యం కోసం టీడీపీ పరువు తీసుకుంటున్నారని.. వారిద్దరినీ కూర్చోపెట్టి రాజీ చేయకపోతే ఇబ్బంది పడక తప్పదంటున్నారు కార్యకర్తలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.