జ‌గ‌న్ ఒక‌టి అనుకుంటే నాయ‌కులు మ‌రొక‌టి చేశార‌ట‌…

రాజు ఒకటి తలిస్తే.. సేవకుడు మరొకటి తలిచాడు అని సామెత. అవును మరి.. రాజుల మదిలో ఏముందో తెలిస్తేనే కదా సేవకులు ఆ విధంగా నడుచుకునేది. అచ్చంగా ఇలాంటి సన్నివేశమే పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వైసీపీలో చోటుచేసుకుంది. పార్టీ అధినేత జగన్ ఒకటి తలుచుకుని నియోజకవర్గ కన్వీనర్‌గా ఒక నాయకుడిని నియమించారు. పాపం.. ఆ కన్వీనర్‌కి మాత్రం మిగతా పార్టీ శ్రేణుల నుంచి మద్దతే కరువయ్యిందట. పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఎంతో కీలకమైన స్థానం. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల ఓటర్లు ఇక్కడ అధికంగా ఉన్నారు. గతంలో ఈ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడు కాగా, 2009లో జనరల్ కేటగిరీగా మారింది. అవడానికి జనరల్ కేటగిరీ సీట్ అయినా, ప్రధాన పార్టీలు బీసీలకే టిక్కెట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి పితాని సత్యనారాయణ కూడా బీసీ కేటగిరీకి చెందిన నాయకుడే. 2009, 2014 ఎన్నికల్లో ఆయన వరుసగా ఇక్కడ విజయం సాధించారంటే, స్థానికంగా బీసీల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలా అని ఎస్సీ ఓటర్లు తక్కువని కాదు. బీసీలతో సమానంగా వారూ ఉన్నారు.
అటువంటి ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మూడు నెలల క్రితం కొత్తగా నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పరిణామానికి కారకులని వైసీపీ శ్రేణులు వేలెత్తిచూపుతున్నాయి. అసెంబ్లీ టిక్కెట్ కూడా దాదాపు ఆయనకే ఖరారు కావడంతో.. మిగిలిన నాయకుల్లో కూసింత జెలసీ ఏర్పడిందట. ఎప్పటినుంచో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న తమకు కాకుండా.. మధ్యలో వచ్చి సీటు ఎగరేసుకుపోతున్నారని ఆయనపట్ల మిగిలిన వారిలో కొంత అసూయ ఏర్పడిందట. ఈ సంగతులే ఇప్పుడు ఆచంటలో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. మూడునెలల క్రితం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌గా చెరుకువాడ శ్రీరంగనాథరాజు నియమితులయ్యారు. అప్పటివరకు రాజకీయంగా తటస్థంగా ఉన్న రంగనాథరాజు తనకు టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తేనే పార్టీలోకి వస్తానని తెగేసిచెప్పడంతో పార్టీ అధినేత జగన్ తలూపారట. అలా ఆయన ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులయ్యారట.
ఆ సందర్భంగా జరిగిన సంభాషణలో చాలా అంశాలే వారి మధ్య చర్చకు వచ్చాయట. పార్టీకి కావాల్సిన వనరులను సమకూర్చడంతో పాటు అప్పటివరకు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నేతల ఇతర అవసరాలను కూడా తీర్చాల్సి ఉంటుందని రంగనాథరాజుకి జగన్ చెప్పారట. అందుకు శ్రీరంగనాథరాజు ఓకే  అనడం.. తదుపరి ఆయనను నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించడం వంటి ఘటనలన్నీ వరుసగా జరిగిపోయాయట. శ్రీరంగనాథరాజుకి కన్వీనర్‌ పదవి కట్టబెట్టిన అనంతరం ఆచంట వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయట. నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న ఎస్సీ నాయకుల ప్రయోజనాలను ఆయన పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు, కొంతమంది ఎస్సీ నేతలు ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు శ్రీరంగనాథరాజు గైర్హాజరయ్యారట. దాంతో ఆ సామాజికవర్గ నేతలు ఆయనపై ఒకింత గుర్రుగా ఉన్నారట. మరోపక్క ఇతర వర్గాల నాయకులు కూడా ఆయనపై కొంత అక్కసును వెళ్లగక్కుతున్నారట.
ఇంతకుముందు నియోజకవర్గ కన్వీనర్‌గా ఉన్న కవురు శ్రీనివాస్ వర్గం కూడా శ్రీరంగనాథరాజుకు దూరంగానే ఉంటోందట. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉద్దేశపూర్వకంగానే కొందరు నేతలు శ్రీరంగనాథరాజుకు ఎడమొహం- పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది. నియోజకవర్గం పైనా, వైసీపీ క్యాడర్‌ పైనా శ్రీరంగనాథరాజు తన పట్టును బిగిస్తే.. తమ ప్రాముఖ్యత, ప్రాబల్యాలకు భంగం కలుగుతుందనే భావన ఆయా నేతల్లో గూడుకట్టుకుందట. ఇలా అని ఆ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. గతంలో ఆచంట నియోజకవర్గంలో ఓడిపోయిన ఒక నాయకుడు శ్రీరంగనాథరాజు హవాకు గండికొట్టాలనే ఉద్దేశంతో అంతర్గతంగా పార్టీ శ్రేణుల్లో విభేదాలు సృష్టిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాల పట్ల వైకాపా పెద్దలు ఎలా స్పందిస్తారో, స్థానిక రాజకీయాన్ని ఎలా చక్కబెడతారో వేచిచూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.