గ‌డ్కరి.. కేసీనేనిల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

కొంతమంది కేంద్రమంత్రులకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. చంద్రబాబుతో మాట్లాడాలనీ, మధ్యవర్తిత్వం వహించాలనీ కొంతమంది కేంద్ర మంత్రులు తెలుగుదేశం ఎంపీలను అడుగుతున్నారు. రాయబారం దశ దాటిపోయిందని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. హస్తినలో జరుగుతున్న పరిణామాలపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఓ కేంద్రమంత్రి కలిశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇరువురూ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు తొందరపడ్డారనీ, తమవారు కూడా చంద్రబాబును నిర్లక్ష్యం చేశారనీ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుతో మాట్లాడేందుకు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదని సూచించారు. కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం, ప్రధానమంత్రి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అంశాలపై కనీస ప్రస్తావన లేకపోవడంతో చంద్రబాబు మనస్థాపం చెందారని నానీ ఆ కేంద్రమంత్రికి వివరించారు. 29సార్లు ఢిల్లీ వచ్చినా కనీసం పట్టించుకోలేదనే బాధ ఆయనలో గూడుకట్టుకుందనీ, ఆ బాధ తమకి కూడా ఉందనీ నాని చెప్పుకొచ్చారు. రాయబారం దశ దాటిపోయిందని కూడా వివరించారు. ఏపీలో ప్రత్యేకహోదా సెంటిమెంట్‌గా మారిందనీ, తమకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందనే భావన ప్రజల్లోకి వెళ్లిందని నాని ఆ మంత్రికి వివరించారు. దీంతో ఆయన తమ పార్టీ అగ్రనేతలు కూడా చంద్రబాబును నిర్లక్ష్యం చేయడం పట్ల బాధని వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గ‌డ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ఆయన విజయవాడకు వచ్చి కృష్ణానదిలో ఏర్పాటుచేసిన భారీ ఫంట్‌ను ప్రారంభించి, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారంటూ సమాచారం అందింది.
ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్రమంత్రిని ఎవరు ఫాలో అవుతారని జలవనరుల శాఖ అధికారులు ఆరాతీశారు. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇంకెవరు వస్తారంటూ మళ్లీ ప్రశ్నించారు. ఇంకెవరూ రారు అని సిఎంవో తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారని గ‌డ్కరీ ఆశించారని చెబుతున్నారు. అయితే సీఎంకి ముందుగా పర్యటనలు ఖరారు కావడంతో ఆయన హాజరుకాబోరని సిఎంవో వర్గాలు తేల్చిచెప్పాయి. కనీసం పోలవరం సమీక్షకు అయినా సీఎం హాజరైతే బాగుంటుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి కూడా హజరయ్యే అవకాశం లేదని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందింది. దీంతో చివరి నిముషంలో నితిన్ గ‌డ్కరీ పర్యటన వాయిదా పడిందంటూ సమాచారం అందించారు. రాష్ట్రంలో హోదా కోసం ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో గ‌డ్కరీ పర్యటనకు వెళితే బాగోదని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న గ‌డ్కరీ తన పర్యటనను స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయన్న సాకుతో వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సహజంగా ఆదివారం ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగే అవకాశమే లేదు. ఇలా కేంద్రమంత్రులు నలుగురైదుగురు తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం పట్ల తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కూడా కేంద్రమంత్రులతో పాలనాపరమైన వ్యవహారాలు మినహా మిగతా రాయబారాలను అంగీకరించడం లేదు. తెలుగుదేశం, బీజేపీ మధ్య ఉప్పు- నిప్పుగా ఉండటంతో కేంద్రమంత్రుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.