దావోస్‌లో.. దేశం స‌యోధ్య‌!

స్విట్ల‌ర్లాండ్‌లో జ‌రిగే దావోస్‌.. భార‌తీయ రాజ‌కీయాల‌కు వేదిక కానుంది. ప్ర‌పంచ ఆర్ధిక స‌ద‌స్సు.. భార‌తీయ జ‌న‌తాపార్టీ.. తెలుగుదేశం పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా నిలువ‌నుందని స‌మాచారం. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకు రూ. 5 ల‌క్షల కోట్ల‌రూపాయ‌లు కావాలంటూ ఆనాడే చంద్ర‌బాబునాయుడు సూచించారు. అప్ప‌టి కాంగ్రెస్ ఐదేమి ఖ‌ర్మ 20 ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌లిస్తామంటూ ఎద్దేవా చేసింది కూడా. అందుకే తెలుగు ప్ర‌జ‌లు భాగానే బుద్ది చెప్పారు. ఒక్క‌సీటు లేకుండా తుడుచుకుపెట్టుకుపోయేలా బుద్ధిచెప్పారు. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో బీజేపీతో స్నేహం చేసిన తెలుగుదేశం పార్టీ ఏపీ ప్ర‌యోజ‌నాల‌నే త‌మ ఎజెండాగా చెబుతూ వ‌చ్చింది. కానీ.. అధికార బీజేపీ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తోడ్పాటు రాలేదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులూ ద‌క్క‌లేదు. ప్ర‌త్యేక ప్యాకేజీతో అయినా స‌రే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని భావించిన చంద్ర‌బాబుకు బీజేపీ ఝ‌ల‌క్ ఇస్తూనే ఉంది. అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌ను ప‌క్క‌నబెట్టిన చంద్ర‌బాబు.. కోట్లాట‌తో కాదు.. మాట్లాడి ప‌రిష్క‌రించుకుందామ‌నే స్నేహ‌ధ‌ర్మానికే ప్రాధాన్య‌త‌నిచ్చారు. అందుకే.. ఈ మ‌ధ్య ఇరు పార్టీల మ‌ధ్య ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌పుడూ సంయ‌మ‌నం పాటించ‌మంటూ శ్రేణుల‌ను ఆదేశించారు. మ‌రోవైపు బీజేపీ కూడా తాను బ‌లం గా భావిస్తున్న అంశంపై అనుమానాలు మొద‌ల‌య్యాయి. కీల‌క‌మైన ఏపీను వ‌ద‌ల‌కుంటే భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నే భావ‌న‌కు వ‌చ్చింది. అందుకే అమిత్‌షా, సుజ‌నాచౌద‌రి మ‌ధ్య కొంత‌మేర చ‌ర్చ‌లు జ‌రిగాయి. సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో దావోస్ స‌మావేశంలో 20ఏళ్ల త‌రువాత భార‌త ప్ర‌ధానిగా మోదీ ప్ర‌సంగించ‌నున్నారు. దీనికి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు కూడా హాజ‌రు కాబోతున్నారు. స‌మావేశాల అనంత‌రం.. న‌రేంద్ర‌మోదీ, చంద్ర‌బాబునాయుడు స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగానే ఏపీకు రావాల్సిన నిధులు, మిత్ర‌ధ‌ర్మం పాటించేందుకు అనుస‌రించాల్సిన ప‌ద్ద‌తుల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో పాగా వేయాల‌నుకుంటున్న బీజేపీకు టీడీపీ మ‌ద్ద‌కు చాలా కీల‌కం. మ‌రోవైపు 2019లో కేంద్రంలో అధికారం చేప‌ట్ట‌డంలో భాజాపాకు ప్రాంతీయ పార్టీల స‌పోర్టు అవ‌స‌రం.
జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స‌త్తా ఆంధ్రుల‌ది. అంత‌ర్గ‌తంగా ఎన్ని కుమ్ములాట‌లున్నా రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఎవ‌రైనా ఒక‌టేనంటూ.. సీటును.. అధికార ఫేటును తారుమారుచేయ‌గ‌ల స‌మ‌ర్దులు. అందాకా.. ఎందుకు.. కాంగ్రెస్ ప్ర‌తిష్ఠ దిగ‌జారిన ప్ర‌తిసారీ.. తెలుగు నేల‌పైనే ఆశ‌లు పెట్టుకోవ‌టం.. దాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు నెర‌వేర్చ‌టం ద‌శాబ్దాలుగా వ‌స్తూనే ఉంది. ఇప్పుడా స్థానంలో బీజేపీ ఉంది.. అధికారానికి.. ఆత్మాభిమానానికి న‌డుమ తెలుగు పార్టీలున్నాయి. ఇప్పుడెందుకీ ముచ్చ‌ట అంటారా! 2014కు ముందు హ‌స్తం పార్టీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రెండు ముక్క‌లు చేసింది. ప్ర‌ధాన ఆర్ధిక వ‌న‌రు హైద‌రాబాద్‌ను అంత‌టి స్థాయికి చేర్చిన ఆంధ్ర‌ప్రాంత వాసుల‌కు నామ‌మాత్రంగా ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని పొమ్మంటూ మూట‌ముల్లె స‌ర్దుకుని నోరుమూసుకుని వెళ్లేలా చేసి పుణ్యం మూట‌గ‌ట్టుకుంది. పోన్లే ప‌దేళ్లు ఉందా!  అనుకుంటే.. తెలుగు రాష్ట్ర నేత‌ల మ‌ధ్య అడ్డ‌మైన రాజ‌కీయాలు చేరి ఆ కాస్త ఉప‌శ‌మ‌నాన్ని దూరంచేశాయి. దీంతో ఇప్ప‌టికిప్పుడు కొత్త రాజ‌ధాని నిర్మాణం అధికార తెలుగుదేశం పార్టీ మీద అద‌న‌పు భార‌మైంది.  ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న మిగిలిన రాష్ట్ర ప్ర‌జ‌లు బీజేపీ ప‌ట్ల వ్య‌తిరేక భావ‌న‌లోనే ఉంటార‌నేది ఇటీవ‌ల బీజేపీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఒక్క మిత్రుడిని దూరం చేసుకుంటే.. త‌లెత్త‌బోయే ప‌రిణామాల‌పై అమిత్‌షా పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. అందుకే.. దేశంతో స‌యోధ్య‌కు ఎక్క‌డైతే ఏమిట‌నే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఎంతైనా.. తెలుగువాడి వాడి.. వేడి.. రాజ‌కీయ వేడిని పుట్టిస్తుంద‌న‌టంలో సందేహ‌మేలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.