ఇమ్రాన్ గెలుపు.. మోదీ విజ‌యానికి సంకేతం!

ఇదేంటీ.. బోడిగుండుకు..మోకాలికి  ముడిపెడుతున్నార‌ని చూస్తున్నారా! దేశ రాజ‌కీయాల‌ను కేవ‌లం ప్రాంతీయ‌పార్టీలే కాదు.. ప్ర‌పంచ దేశాల్లో చోట‌చేసుకునే రాజకీయ‌, సామాజిక అంశాల ప్ర‌భావం కూడా ఉంటుంది. అందుకే.. ట్రంప్ గెలిచిన‌పుడు.. ఇదంతా ర‌ష్యా స‌హ‌కారం అన్నారు. చైనాలో ఏదైనా జ‌రిగితే.. అమెరికా కార‌ణ‌మంటారు.. అందాకా ఎందుకు భార‌త్‌లో ఎటువంటి ప‌రిణామాలు జ‌రిగినా దానివెనుక చూశారా పాక్ హ‌స్తం అంటారు. కానీ.. ఈ సారి  పాక్ ప్ర‌ధానిపీఠం ఎక్క‌బోతున్న ఇమ్రాన్‌ఖాన్ విజ‌యం.. భార‌త్‌లో ప్ర‌భావం చూపుతుంద‌నే  విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. వాస్త‌వానికి ఇమ్రాన్ 22 ఏళ్ల‌క్రితం పార్టీ పెట్టాడు. ఒక్క సీటుతో గెలిచి.. ఇప్పుడు ఏకంగా ప్ర‌ధానిపీఠం పైకి చేర‌బోతున్నారు. అత‌డు క్రికెట‌ర్‌గా ఉన్న‌పుడే భార‌త్‌పై నిప్పులు చెరిగేవాడు. పైగా భార‌త‌జ‌ట్టుప‌ట్ల చాలా దురుసుగా వ్య‌వ‌హ‌రించేవాడు.  మియాందాదా, ఇమ్రాన్‌, షోయ‌బ్ అక్త‌ర్ వీరంతా పేరుకే క్రికెట‌ర్లు కానీ.. భార‌త్‌పై ద్వేషంతో ర‌గిలిపోయే పాక్ పౌరుల‌నే చెప్పాలి. అటువంటి జ‌ట్టులో ఇమ్రాన్ ప్ర‌ధాని కావ‌టం.. భార‌త్ కు గ‌డ్డు కాల‌మే. ఇప్ప‌టికే కాశ్మీర్ అంశం ర‌గులుతూనే ఉంది. బీజేపీ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చాక ఇది రావ‌ణ‌కాష్టంలా మారింది. పాక్ స‌రిహ‌ద్దులో స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ చేయ‌టంపై పాక్ ర‌గులుతోంది . అద‌నుచూసి దెబ్బ‌కొట్టాల‌ని చూస్తోంది. దీనిలో భాగంగానే  పాక్ ఉగ్ర‌వాదాన్ని ప్రేరేపిస్తోంది.
కాశ్మీర్‌లో యువ‌త‌ను రెచ్చ‌గొడుతుంది. దీని ఫ‌లితంగా ఇన్నేళ్ల‌లో క‌శ్మీర్ అల్ల‌ర్లు మ‌రీ తారాస్థాయికి చేరాయి. ఇప్పుడిక ఇమ్రాన్ వంత‌.. న‌వాజ్‌ష‌రీఫ్ భార‌త్ అనుకూల వాది అంటూనే నెగ్గిన నాయ‌కుడు. ఇప్పుడు అదే ఊపుతో భార‌త్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు చిన్నాభిన్నం చేసేందుకు ఎంత‌కైనా తెగించే అవ‌కాశం ఉంది. పైకి భార‌త్‌తో చ‌ర్చ‌లు అని చెబుతున్నా.. ఆర్మీ చేతిలో కీలుబొమ్మ‌గా సంత‌కం పెట్టాల్సిన దుస్థితి ఇమ్రాన్ ది. ఇమ్రాన్ దూకుడును మోదీ చూస్తూ ఊరుకుంటాడా! ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా పాక్‌తో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తారు. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్ తీరును ఎండ‌గ‌డుతూనే.. మ‌రోవైపు పాక్షిక యుద్ధంతో మోదీ.. జ‌నాల్లో కీర్తికోసంప్ర‌య‌త్నించే అవ‌కాశాలున్నాయి. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కూ కార‌ణాలు వెతుక్కోవాల్సి వ‌చ్చేది.. ఇప్పుడు ఇమ్రాన్ రూపంలో ఆ అవ‌కాశం మోదీ కాళ్ల వ‌ద్ద‌కు చేరింది. ఇటువంటి స‌మ‌యంలో పాక్‌తో స్వ‌ల్ప‌కాలిక యుద్ధ‌మో.. మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ త‌ప్ప‌నిస‌రిగా ఇండియ‌న్ ఆర్మీ ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. శ‌త్రువును దెబ్బ‌తీసే స‌మ‌యంలో దేశ‌భ‌క్తి నినాదం.. క‌శ్మీర్‌నుచూపి.. పాక్‌బూచిగా మ‌రోసారి తెర‌మీద‌కుతీసుకు వ‌స్తుంది బీజేపీ. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో దేశ‌భ‌క్తి ఎమోష‌న్ ర‌గిలించిన‌ట్ట‌వుతుంది. ఎన్నిక‌ల వేళ‌.. కాషాయ‌జెండా ఎగుర‌వేసే అవ‌కాశం చిక్కుతుంది. వాట్‌.. ఇమ్రాన్‌.. నువ్వు గెలిచి.. మ‌మ్మ‌ల్నీ గెలిపిస్తున్నావంటూ.. క‌మ‌ల‌నాథులు ఆనంద‌ప‌డాల్సిందేనేమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.