‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
తారాగ‌ణం: అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు, ఝాన్సీ, హేమ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: అనీష్ త‌రుణ్ కుమార్
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఎం కిర‌ణ్ కుమార్
సంగీత ద‌ర్శ‌కుడు: శ్రీ‌వ‌సంత్
ఎడిట‌ర్: గౌతంరాజు
నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
ద‌ర్శ‌కుడు: భీమినేని శ్రీ‌నివాస్

అల్లరి నరేష్ అంటేనే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. సినీ కెరీర్ ప్రారంభించిన కొద్దిరోజులకే మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. అలాంటిది గత ఆరు సంవత్సరాలుగా ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. ‘సుడిగాడు’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా కావాల్సిన ఫలితాన్ని మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు సుడిగాడు సినిమా డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్‌. ఈ చిత్రం తర్వాత అతనూ మరో హిట్ సాధించలేకపోయాడు. వీరికి తోడు కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా మారిన సునీల్.. హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఇలాంటి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘సిల్లీ ఫెలోస్’. నవ్వులు పూయించడానికి రెడీ అంటూ ప్రకటించిన ఈ సిల్లీ ఫెలోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారా..?

కథ
జాకెట్ జానకిరామ్ (జయప్రకాశ్‌రెడ్డి).. ఆడవాళ్ల జాకెట్లు కుట్టే స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన మంచి మనిషి. ఆయనకు నమ్మినబంటుల్లా ఉంటారు వీరబాబు (అల్లరి నరేష్), సూరిబాబు (సునీల్). జానకిరామ్‌ను ఆదర్శంగా తీసుకున్న వీరబాబు ఆయనను మంత్రిని చేయాలని, తద్వారా తాను ఎమ్మెల్యే అయిపోవచ్చని అనుకుంటుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో జానకిరామ్ తలపెట్టిన ఓ కార్యక్రమం ఫెయిల్ అవకూడదని తన స్నేహితుడు సూరిబాబుకు రికార్డింగ్ డ్యాన్సర్ పుష్ప(నందిని రాయ్)కు పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి వల్ల సూరిబాబు ఇరకాటంలో పడతాడు. మరోవైపు వాసంతి(చిత్ర శుక్ల)ని ఇష్టపడే వీరబాబు ఆమెను పోలీస్‌ ఆఫీసర్‌ను చేస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకొని అవి జానకిరామ్‌కు ఇస్తాడు. కానీ ఆ డబ్బు తనకు తిరిగిచ్చేయాలని వీరబాబును వాసంతి డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపు చనిపోయిన తన మంత్రి బావ.. ఎమ్మెల్యే జానకిరామ్‌కు ఆస్తికి సబంధించిన సీక్రెట్ చెప్పాడని దాన్ని తెలుసుకోవాలని భూతం (పోసాని) ప్రయత్నిస్తుంటాడు. ఇన్ని సమస్యలకు కేంద్ర బిందువుగా ఉన్న ఎమ్మెల్యే జానకిరామ్‌కు ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ తరవాత ఏం జరిగింది. జాకెట్ జానకి కోమాలో నుంచి బయటికి వచ్చాడా? పుష్ప సమస్య నుంచి సూరిబాబు బయటపడ్డాడా? వాసంతి, వీరబాబుల కథ ఏమైంది? అసలు జానకిరామ్‌కు మంత్రి చెప్పిన సీక్రెట్ ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
కామెడీ సినిమాలు చేయడంలో అందవేసిన చేయి కలిగిన ముగ్గురు కలిసి చేసిన చిత్రం ఇది. తమిళంలో విజయం సాధించిన సినిమాలో చిన్న చిన్న మార్పులు చేసి తెలుగు ప్రాంతీయతకు సరిపోయేలా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై వస్తున్న కామెడీ షోలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో ఒక కామెడీ సినిమా తీస్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ సినిమాలో అవేవీ కనిపించవు. అవే రోటీన్ పంచులు, లాజిక్కు లేని సీన్లు. కాకపోతే కొన్ని సీన్లు, పంచులు పేలాయి.. కొన్ని సీన్లయితే పాత సినిమాలను గుర్తుకుతెచ్చి విసుగు పుట్టిస్తాయి. కథపై కంటే కామెడీ చేయడంపై దృష్టి పెట్టడం ఈ సినిమాకు ప్రధాన బలహీనత అని చెప్పవచ్చు. మధ్యలో సాగతీతగా అనిపించడంతో పాటు.. క్లైమాక్స్ రొటీన్‌గా ముగుస్తుంది. సినిమా యూనిట్ మొదట్లో చెప్పినట్లే లాజిక్కులు లేకుండా సినిమా చూసేవారు కొంచెం నవ్వుకోవచ్చు. మిగతా వారికి మాత్రం ‘సిల్లీ’గా అనిపించకమానదు.

నటీనటుల పనితీరు
ఎప్పటిలాగే అల్లరి నరేష్ ఈ సినిమాలో కూడా ఆకట్టుకున్నాడు. ఈ తరహా పాత్రలు చేయడం అతడికి కొట్టిన పిండే. కాకపోతే అతడి యాక్టింగ్ పాత సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం.. సునీల్ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం. పేరుకు కమెడియన్ అయినా.. నరేష్‌తో పాటే అతడి పాత్ర కూడా సాగుతుంది. ఇక హీరోయిన్ చిత్ర శుక్ల పోలీస్ ఆఫీసర్‌గా బాగుంది. రఫ్ అండ్ టఫ్‌గా ఇరగదీసింది. నందిని రాయ్, పూర్ణ పాత్రల నిడివి చాలా తక్కువ. వీరిద్దరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక పోసాని, జయప్రకాశ్‌రెడ్డి, హేమ, రాజారవీంద్ర, రఘు కారుమంచి, ఝాన్సీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నీషియన్ల పనితీరు
రిమేక్ సినిమాలకు అలవాటు పడ్డ భీమినేని మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. కాకపోతే ఒకే మూసలో సినిమాను తీసుకువెళ్లాడు. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు కూడా క‌థ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. క‌థ‌నం స‌రిగ్గా కుదిరితే చాలు అనుకున్నాడు. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ వినోదం పండించాల‌ని ప్ర‌య‌త్నించాడు. సాంకేతికంగా సినిమా రిచ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీ వసంత్ స్వరపరిచిన మూడు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా పెంచలదాస్ ఆలపించిన ‘హెడేకురా మామ’ పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, ఆర్ట్ డిజైన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి.

బలాలు
* నరేష్, సునీల్ యాక్టింగ్
* పాటలు

బలహీనతలు
* రొటీన్ కామెడీ
* సాగతీతగా అనిపిస్తుంది
* లాజిక్కులేని సన్నివేశాలు

మొత్తంగా: పేరుకు తగ్గట్టే ‘సిల్లీ’ సినిమా

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.