హలో గురు ప్రేమ కోసమే మూవీ రివ్యూ

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

నటీనటులు: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, ప్రకాష్‌రాజ్‌, మహేష్‌, సితార, వి.జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు

సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి చక్రవర్తి

ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

సమర్పణ: దిల్ రాజు

నిర్మాత: శిరీష్‌, లక్ష్మణ్‌

దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన

ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండడం.. ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోక‌ల్’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రామ్‌కు ఈ మధ్య హిట్లు లేకపోవడం.. దిల్ రాజు గత సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమాపై ఈ ఇద్దరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, దేవీ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..?

కథ

తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరుగుతాడు సంజూ(రామ్). కాకినాడలో పుట్టి పెరిగిన సంజూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ తన తల్లి స్నేహితుడు విశ్వనాథ్(ప్రకాష్‌రాజ్) ఇంట్లో గెస్టుగా ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఓ ట్రైనింగ్ సెంటర్‌లో రితూ(ప్రణీత)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమను దక్కించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల కోసం ఇంటికెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో అనుపమ(అనుపమ పరమేశ్వరన్)ను చూసి ఇష్టపడతాడు. అప్పడే తాను ప్రేమించేది అనుపమనేననే విషయాన్ని గ్రహిస్తాడు. అప్పుడు అనుపమ గురించి కొన్ని నిజాలు సంజూకు తెలుస్తుంది. ఇంతకీ సంజూకు తెలిసిన ఆ నిజాలేంటి..? చివరకు సంజూ తన ప్రేమను గెలుచుకున్నాడా..? విశ్వనాథ్‌కు సంజూకు మధ్య ఉన్న సంబంధమేంటి..? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే

సినిమాకెళ్లిన ప్రేక్షకుడికి ఇదంతా తెలిసిన కథే అనిపిస్తుంది. కాకపోతే డైరెక్టర్ దాన్ని డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. పాత కథకే కామెడీ హంగులు జోడించి సినిమా ఆసాంతం మంచి ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. దర్శకుడు గత చిత్రాల్లాగే కామెడీ, ఎమోషన్, యూత్‌కు నచ్చే పాయింట్లతో సినిమాను తెరకెక్కించడంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇందులో ముఖ్యంగా మూడు పాత్రలు సినిమాను మరో నడిపిస్తాయి. రామ్, ప్రకాష్‌రాజ్, అనుపమలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో ప్రేక్షకుడి మన్ననలు పొందుతారు. మొత్తంగా ఈ సినిమా పండుగ పూట కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోడానికి చూసేయొచ్చు.

నటీనటుల పనితీరు

ప్రయోగాలు చేస్తే ప్రేక్షకులు ఇష్టపడడంలేదని గ్రహించిన హీరో రామ్.. మరోసారి లవ్ కమ్ రొమాంటిక్ పాత్రకే జై కొట్టాడు. గత సినిమాల్లోలానే ఎనర్జిటిక్ నటనతో, డ్యాన్సులతో మెప్పిస్తాడు. కామెడీ సీన్స్‌లో తనదైన శైలిని చూపించాడు. అలాగే హీరోయిన్ అనుపమ ఫస్టాఫ్‌లో పెద్దగా కనిపించకపోయినా, సెకెండాఫ్‌లో మాత్రం మంచి డైలాగ్స్ చెబుతూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మరో హీరోయిన్ ప్రణీత చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. గ్లామర్‌గా కూడా కనిపించదు. కానీ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ అంటే ప్రకాష్‌రాజ్ అనే చెప్పాలి. హీరో ఫ్రెండ్‌గా.. హీరో లవ్ చేసే అమ్మాయి తండ్రిగా ఆయన నటించిన తీరు అద్భుతం. రామ్-ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక మిగతా నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్ల పనితీరు

వరుస విజయాలతో దూకుడు మీదున్న డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన తీసుకున్నది రొటీన్ స్టోరీనే అయినా.. దానిని మలిచిన తీరు బాగుంది. పాత కథకు కామెడీ, ఎమోషన్ జోడించి సినిమా ఆద్యంతం మెప్పించేలా చేశాడు. అయితే, కొన్ని సన్నివేశాలు బలహీనంగా ఉన్నాయి. వాటిని ప్రేక్షకుడు ముందే ఊహించేస్తాడు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సినిమాలో పాటలు వినడానికి బాగున్నా బయట పాడుకోడానికి అంతగా గుర్తుండని విధంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. సినిమాకు ఎంత వరకు కావాలో అలానే ఎడిటింగ్ చేశాడు. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. కొన్ని చోట్ల సినిమా దిల్ రాజే తీశాడా అనే అనుమానాలు కలుగుతాయి.

బలాలు

* రామ్ నటన

* కామెడీ సీన్స్

* డైలాగ్స్

బలహీనతలు

* రొటీన్ కథ

* ఊహకందే సన్నివేశాలు

మొత్తంగా: ‘హలో గురు’ కాసేపు నవ్వుకోడానికే…

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.