హరీష్ రాజీనామా తప్పదా? కారు పయనం ఎటువైపు..?

టీఆర్ఎస్ పార్టీలో చాలా ముఖ్యమైన నాయకుడు హరీష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైన ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ప్రజా మన్ననలు పొందారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు పోషించిన పాత్ర అందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేసి టీఆర్ఎస్ మొదటిసారి విజయభేరి మోగించాక కీలక మంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించడంలో, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేయటంలో హరీష్ ముఖ్యపాత్ర పోషించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో హరీష్ కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమని అందరికీ అర్థమైంది. అయితే రెండోసారి కూడా విజయకేతనం ఎగరేసిన గులాబీ పార్టీ.. హరీష్ రావు విషయంలో వ్యవహరిస్తున్న విధానాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 

తన సొంత నియోజకవర్గం సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు హరీష్ రావు. ఈ సారైతే మునుపెన్నడూ ఎవ్వరూ సాధించని అత్యధిక మెజారిటీ సంపాదించారు హరీష్. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ వ్యవహారాల్లో చురుకుగా కనిపించని ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తుండటం తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ వార్తల వెనుక ఉన్న కథనాన్ని పరిశీలిస్తే.. కేసీఆర్ ఆదేశాల మేరకే సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు హరీష్ సిద్ధమయ్యారని తెలుస్తోంది.

కొడుకు కేటీఆర్ కి పార్టీలో ఉన్నత స్థానం కల్పించే క్రమంలో హరీశ్ రావును ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించారట. సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలా దగ్గరపడింది కాబట్టి.. మెదక్ నుంచి హరీష్ రావును ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఆయన హరీశ్ రావుకు ఆదేశించారని సమాచారం. దీంతో చేసేదేమీ లేక హరీశ్ రావు రాజీనామాకు సిద్ధపడ్డారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే సిద్దిపేటలో ఉప ఎన్నికలు నిర్వహించి హరీశ్ రావు భార్యను ఎమ్మెల్యేగా బరిలోకి దించాలనే కోణంలో కేసీఆర్ ఓ ఆలోచనకు వచ్చారని అంటున్నారు. ‘‘మరో నాలుగు నెలల్లో సిద్దిపేటకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. హరీశ్ సతీమణి శ్రీనిత అక్కడి నుంచి పోటీ చేస్తారు’’ అని ఓ రాజకీయవేత్త సోషల్ మీడియాలో పెట్టడం ఈ వార్తలకు నాంది పలికింది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం జారీ కాలేదు.

మరోవైపు తాను కూడా ఎంపీగా పోటీ చేసి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే తన కొడుకు కేటీఆర్‌ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.            

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.