మీది తెనాలి… మాది తెనాలి.. అయినా విజయం తెలవాలి!

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి 1983 నుండి ఈనాటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన ‘నాదెండ్ల భాస్కర్‌రావు’ 1994లో ఓడిపోయారు. 1994లో విజయం సాధించిన రావి రవీంద్రనాథ్‌చౌదరి ‘నాదెండ్ల భాస్కర్‌రావు’ను ఓడించినా 1999లో పోటీ చేసే అవకాశం లభించలేదు. గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్‌ దివంగత దొడ్డపనేని ఇందిర కుమార్తె డాక్టర్‌ ఉమ 1999లో విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. 2004,2009ల్లో విజయం సాధించిన నాదెండ్ల మనోహర్‌ 2014లో ఓడిపోయారు. కీ.శే. దొడ్డపనేని ఇందిర 1972,78ల్లో విజయం సాధించి 1983లో ఓడిపోయారు. 2009లో ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 2014లో విజయం సాధించారు. నియోజకవర్గంలో టీడీపీ నేత ‘ఆలపాటి’పై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనను ధీటుగా ఎదుర్కోగలిగిన వైకాపా నాయకులు ఎవరూ కనిపించడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన తెనాలి నుంచి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదంటున్నారు. వైకాపా అభ్యర్థిగా మళ్లీ ఎవరు రంగంలోకి దిగుతారో కానీ..’ఆలపాటి’ని ఓడించగలుగుతారా..? అనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ప్రభావంతో టిడిపి అభ్యర్థి ఓడిపోయారని, అదే విధంగా 2019లో ‘జనసేన’ ప్రభావంతో టిడిపి అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని వైకాపా నేతలు అంచనా వేస్తున్నారు. కాగా తెనాలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగితే వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తారా..? లేదా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తారా..? అనే విషయంపై పెద్దఎత్తున చర్చలు జరగుతున్నాయి. టిడిపి ఓట్లను ‘జనసేన’ కొల్లగొడుతుందని, దాంతో వైకాపా విజయం సాధిస్తుందని వైకాపా నాయకులు ఆశలు పెంచుకుంటున్నారు.  మరోవైపు ఆనాటి ప్రజారాజ్యం ప్రభావం టిడిపిపై పనిచేసినా, ఈసారి ‘జనసేన’ రంగంలో ఉంటే వైకాపాకే నష్టమని ఆలపాటి వర్గీయులు అంటున్నారట. ఈసారి జరగబోయే ఎన్నిక ఫలితాలపై ఎవరూ ఊహించలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిపై కాస్త వ్యతిరేకత ఉన్నా, చంద్రబాబుపై అనుకూలత ఉందని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఒకవేళ ‘నాదెండ్ల’ మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగితే చతుర్మఖ పోటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత గందరగోళం నెలకొన్న తెనాలిలో ఏ పార్టీ విజయం సాధిస్తే, ఆ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.