గుంటూరు నేత‌లు కొంప ముంచుతారా!

ఏ పార్టీ అధికారంలో వున్నా.. ఏ నేత చ‌క్రం తిప్పుతున్నా.. గుంటూరు జిల్లాకు ప్రాధాన్య‌త ఉండాల్సిందే. అది కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ.. మ‌రేదైనా ఒక్క‌టే. రాజ‌కీయంగా ఎంతో చైత‌న్యం వున్న జిల్లా కావ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌నాలి. 17 నియోజ‌క‌వ‌ర్గాల పెద్ద జిల్లా కావ‌టం.. కేంద్రంలోనూ చ‌క్రం తిప్ప‌గ‌ల స‌మ‌ర్థులున్న నేత‌లున్న ప్రాంత కావ‌టం కూడా మ‌రో కీల‌క‌మైన అంశం. ప‌ల్నాడు, గుంటూరు, డెల్టా మూడు ప్రాంతాలు భిన్నంగా ఉంటాయి. అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌న విధానం.. రాజ‌కీయాలు కూడా వైవిధ్య‌మే అనాలి. ప‌ల్నాడు రాజ‌కీయాలు.. రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌ను పోలి ఉంటాయి. డెల్టా అయితే.. అర్ధం చేసుకోవ‌టం క‌ష్టం.. వ్యాపార‌, వాణిజ్య‌వేత్త‌లే రాజ‌కీయాల్లోకి రావ‌టంతో.. డ‌బ్బుకు కొదువ ఉండదు. ఏది కావాల‌న్నా చిటికెలో అమ‌ర్చ‌గ‌ల‌రు. క్ష‌ణాల్లో మంత్రిప‌ద‌వులు తారుమారు చేయ‌గ‌ల దిట్ట‌లు. అందాకా ఎందుకు.. రాష్ట్ర సీఎంల త‌ల‌రాత‌ను మార్చాల‌న్నా వారికే చెల్లింద‌నాలి. అందుకే గుంటూరు రాజ‌కీయ రాజ‌ధానిగా విశ్ల‌ేష‌కులు అభివ‌ర్ణిస్తుంటారు. ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో ఉంది. ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో వున్న నేత‌లు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. రాజ‌ధాని ప్రాంతం కావ‌టంతో చోటానేత‌లు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పేరు జెప్పి అడ్డ‌గోలు కార్య‌క‌లాపాల‌కు తెగ‌బ‌డుతున్న‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. అటు గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, న‌ర్స‌రావుపేట‌లో కోడెల వార‌సులు, చిల‌క‌లూరిపేట‌లో మంత్రి ప్ర‌త్తిపాటి, ఎమ్మెల్యే రావెల‌.. ఇలా దాదాపు 10 మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఆరోప‌ణలు తారాస్థాయికి చేరాయి. రాజ‌ధానిలోనే ఇలా జ‌రిగితే.. మిగిలిన చోట్ల ఎలా ఉంద‌నేది ఇప్పుడు తెలుగుదేశానికి స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌తిప‌క్ష నేత త‌ప్పిదాల‌తో టీడీపీపై ప్ర‌జ‌లు అభిమానం పెంచుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లోనూ రాజ‌ధాని నిర్మాణం.. కొత్త రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు ఉత్త‌మం అనే అంచ‌నాలో ఉన్నారు. ఇటువంటి స‌మ‌యంలో గుంటూరు నేత‌ల త‌ప్ప‌ట‌డుగులు పార్టీ పై ప్ర‌భావం చూపుతాయ‌నే ఆందోళ‌న తెలుగు త‌మ్ముళ్ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనిపై అధినేత చంద్ర‌న్న ఎలా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.